Mohan Bhagwat | భారత దేశ జనాభా వృద్ధి రేటు తగ్గుతుండడంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి మించి ఉండాలని ఆధునిక జనాభా శాస్త్రం చెబుతోందన్నారు. జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశమని.. సమాజంలో సంతానోత్పత్తి రేటు 2.1 శాతం కంటే తక్కువగా ఉంటే.. ఆ సమాజం ఎలాంటి సంక్షోభం అవసరం లేకుండానే భూమిపై మనుగడ అంతరించిపోయే అంచునకు చేరుకుంటుందని ఆధునిక జనాభా శాస్త్రం చెబుతోందన్నారు. జనాభా తగ్గడం వల్ల అనేక భాషలు, సమాజాలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయన్నారు.
1998, 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతానికి కంటే సంతోనోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని గుర్తించిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు. సమాజం మనుగడకు ఇద్దరు, ముగ్గురి అవసరం ఉందన్న ఆయన.. ఆధునిక జనాభా శాస్త్రం చెబుతున్నది కూడా ఇదే చెబుతుందన్నారు. ఈ సంఖ్య చాలా కీలకమని లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. జనాభా వృద్ధి రేటు తగ్గుముఖం పట్టడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. ఇదిలా ఉండగా.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వస్తున్నది. 1950 సంవత్సరంలో ఫెర్టిలిటీ రేటు 6.2శాతం కంటే ఎక్కువ ఉండగా.. ప్రస్తుతం అది 2.1శాతానికి తగ్గింది. ఇలా కొనసాగితే 2050 నాటికి సంతానోత్పత్తి రేటు 1.3కి పడిపోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.