CM KCR | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాందేడ్ సభలో చేసిన ప్రకటనలు మాహారాష్ట్ర సంకీర్ణ సర్కారుకు దడ పుట్టించాయని, దాంతో ప్రజలను మభ్యపెట్టేందుకు హడావుడిగా పథకాలు ప్రకటిస్తున్నదని మహారాష్ట్ర మాజీ శాసనసభ్యుడు చరణ్భావూ వాగ్మారే ఎద్దేవాచేశారు. లక్ష మందితో నిర్వహించిన నాందేడ్ సభలో తెలంగాణలో అమలవుతున్న పథకాలను కేసీఆర్ వివరించారని గుర్తుచేశారు. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో తుమ్సార్ తాలూకా కేంద్రంలో గ్యాస్ ధర పెంపునకు నిరసనగా మహిళలు ర్యాలీ నిర్వహించారు. వారిని ఉద్దేశించి వాగ్మారే మాట్లాడుతూ మహారాష్ట్ర సర్కారు తెలంగాణ సీఎం కేసీఆర్ పథకాలను కాపీ కొడుతున్నదని అన్నారు. మాట తప్పే రాజకీయ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని మాననీయ అంబేడ్కర్ చెప్పారని గుర్తు చేశారు.
గ్యాస్ సిలిండర్ గురించి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి.. ఆ తర్వాత ధరను మూడింతలు చేసిన మోదీ సర్కారుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చరణ్భావూ వాగ్మారే పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన సభలో పాల్గొన్న మహిళలను, కార్యకర్తలను ఉద్దేశించి వాగ్మారే మట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ… పేదవాడు ఇల్లు కట్టుకోవాలన్నా మహారాష్ట్రలో రూ. 5000 పెట్టినా ట్రాక్టరు ఇసుక దొరకటం లేదని, అదే తెలంగాణ లో ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇసుక తోలుకోవచ్చన్నారు. కేవలం ట్రాక్టరు కిరాయి రూ.500తో ఇసుక వచ్చిపడుతుందని చెప్పారు. ఇటీవల నాందేడ్‌లో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఏర్పాటు చేసిన సభతో బీజేపీ నాయకులలో భయం మొదలైందని అన్నారు. అందుకే ప్రజలను మభ్య పెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నదని ఆయన అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలైన ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూం , కళ్యాణ లక్ష్మి లాంటి పథకాల గురించి వివరించారు. మహారాష్ట్రలో తక్కువ పెన్షన్ ఇస్తున్నారని, అదీ అధికారుల చుట్టూ తిరిగితే గానీ డబ్బులు రావని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేస్తున్నదని వాగ్మారే చెప్పారు. అయితే పక్కరాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి తెలుస్తుండటంతో బిజేపీ నాయకులు మాయ మాటలు చెబుతున్నారని, వారి మాయలో పడవద్దన్నారు. ప్రజలు ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో గ్యాస్ సిలండర్ ధర రూ. 400 లు ఉన్నప్పుడు, ఇదే నరేంద్ర మోదీ ఓటేసేందుకు వెళ్లేటప్పుడు సిలిండరుకు దండం పెట్టి ఓటు వేసేందుకు వెళ్లాలని చెప్పారని వాగ్మారే గుర్తు చేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం గ్యాసు సిలిండర్ ధర రూ.1150కి ఎలా పెంచారని ప్రశ్నించారు.
చీటికి మాటికి గ్యాసు ధర పెంచి, వచ్చే ఎన్నికల్లో ఓటేసే ముందు కూడా సిలిండర్‌కు దండం పెట్టి వెళ్లే పరిస్థితి తీసుకువచ్చారని వాగ్మారే మండిపడ్డారు. బ్యాంకు లోన్లు ఎగ్గొట్టి పారిపోయిన బడాబాబుల వల్ల జరిగిన నష్టాన్ని సామాన్యుల వద్ద వసూలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ గ్యాసు ధర పెంచారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అదానీ ఎల్ఐసీ లోని ప్రజల సొమ్మును ఎలా జేబులో వేసుకొంటున్నదీ వివరించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని మాయ మాటలు చెప్పిన మోదీ, తన హామీలు మరిచిపోయాడని, ఈ సారి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మహిళలను కోరారు. మహారాష్ట్ర లో ఏదేని ప్రభుత్వ పథకం పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలని, కాని పొరుగు రాష్ట్రంలోని తెలంగాణలో లబ్దిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ అవుతాయని అన్నారు. మహారాష్ట్రలో మాటల ప్రభుత్వం ఉంటే తెలంగాణలో చేతల ప్రభుత్వం ఉందని, అక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ మనకు కండ్లకు కట్టినట్లు కనబడుతున్నాయని, ఈ సారి మోదీకి ఓటుతోనే సరైన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.
పొరుగు (తెలంగాణ) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నాందేడ్‌లో పెట్టిన సభతో బీజేపీ నాయకుల్లో భయం మొదలైంది. అందుకే ప్రజలను మభ్యపెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాల ప్రకటనలు చేస్తున్నది.సబ్కా సాత్.. సబ్ కా వికాస్ అని చెప్పిన మోదీ తానిచ్చిన హామీలు మరచిపోయారు. మహిళలను మోసం చేశాడు. ఈ ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలి.
– మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే చరణ్ వాగ్మారే