ముంబై, జూన్ 29 (నమస్తే తెలంగాణ): విద్యార్థులపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతూ తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర సర్కారు యూటర్న్ తీసుకుంది. త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గింది. పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలు, రాజకీయ పార్టీల హెచ్చరికలతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. త్రిభాషా విధానంపై ఆర్డినెన్స్‌ను రద్దుచేస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ ఆదివారం ప్రకటించారు. మహారాష్ట్రలోని ఇంగ్లిష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో 1-5 తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని విపక్ష శివసేన (యూబీటీ), రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) సహా పలు పార్టీలు వ్యతిరేకించాయి.
దీనిపై ఆందోళనకు కార్యాచరణ రూపొందించాయి. దీంతో మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని సీఎం తెలిపారు. అయితే దీనిని ఎలా అమలు చేయాలనే విషయాన్ని పరిశీలించేందుకు నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని వేశామని, దాని నివేదిక వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తాము హిందీని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, వాస్తవానికి, ఈ నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తీసుకుందని వెల్లడించారు.
ప్రజా వ్యతిరేకతకు ఫడ్నవీస్ ప్రభుత్వం తలొగ్గిందని రాజ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర విద్యార్థులపై హిందీని రుద్దేందుకు చేసిన త్రిభాషా విధాన ప్రయత్నం విఫలమైందన్నారు. ఇందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలిపారు.