పుణె, జూలై 19: మహారాష్ట్ర పుణె జిల్లా బారామతిలోని ఓ జాతీయ బ్యాంకులో చీఫ్ మేనేజర్ హోదాలో ఉన్న శివశంకర్ మిత్రా(40) బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. పని ఒత్తిడే కారణమంటూ ఆతడు లేఖ రాశాడు. బ్యాంకులో పని ఒత్తిడి తట్టుకోలేక జూలై 11న ఉద్యోగానికి రాజీనామా చేసిన శివశంకర్.. నోటీస్ పీరియడ్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం పని వేళలు పూర్తయిన తర్వాత ఉద్యోగులను వెళ్లిపోవాలని చెప్పిన శివశంకర్… బ్యాంకులో ఒక్కడే ఉన్నాడు. రాత్రి 9:30 గంటలకు వాచ్మాన్ కూడా వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటలకు శివశంకర్ ఉరి వేసుకున్నట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
శివశంకర్‌కు ఆయన భార్య ఫోన్ చేస్తున్నా స్పందన లేకపోవడంతో అర్ధరాత్రి ఆమె బ్యాంకు వద్దకు వచ్చింది. బ్యాంకులో పనిచేసే ఇతర అధికారులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. వాళ్లు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడగా శివశంకర్ మిత్రా సీలింగ్‌కు ఉరివేసుకుని చనిపోయి కనిపించాడు. సహచర ఉద్యోగిని అడిగి తాడు తెప్పించుకున్నాడని, దాంతోనే అతడు ఉరి వేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అనారోగ్య సమస్యలు, పని ఒత్తిడి శివశంకర్ ఆత్మహత్యకు కారణమని చెప్పారు.