Zika Virus | మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపుతున్నది. పుణేకు చెందిన ఓ వైద్యుడితో పాటు ఆయన కూతురు ఇద్దరూ వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం వారి ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల సదరు వైద్యుడికి శరీరంపై దద్దరులు రాగా.. జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన రక్త నమూనాలను సేకరించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) పంపారు. ఈ నెల 21న వైద్యుడికి జైకా వైరస్ సోకినట్లు తేలింది. వైద్యుడు పుణే నగరంలోని ఎరంద్వానే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
వైరస్ సోకిన వైద్యుడి కుటుంబీకుల రక్త నమూనాలను సేకరించినట్లు ఓ అధికారి తెలిపారు. టెస్టులో వైద్యుడి 15 సంవత్సరాల కూతురికి వైరస్ సోకినట్లు వెల్లడైందని వివరించారు. ఏడిస్ దోమలు కుట్టడం జికా వైరస్ సోకుతుంది. 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. పుణే నగరంలో రెండు జికా కేసులు నమోదవడంతో మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దోమల నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దోమల వ్యాప్తిని నిర్మూలించేందుకు ఫాగింగ్ చేయడం తదితర ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
జికా వైరస్ సోకితే కొందరిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. మరి కొంతమందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీంతో వైరస్‌ని గుర్తించడం కష్టంగా మారుతుంది. సాధారణంగా జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కీళ్లు.. కండరాల నొప్పి, కళ్ళ మంట, అలసట, పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. వైరస్ దోమల కారణంగా వస్తుంది. దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. నిండుగా బట్టలు వేసుకోవాలి. ఇంట్లోకి దోమలు రాకుండా ఇంటి తలుపులు, కిటికీలకు మెష్‌ని ఏర్పాటు చేసుకోవడం మంచింది. అదే విధంగా దోమల వికర్షణ లేపనాలు వాడాలి. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలి. వైరస్ సోకిన వ్యక్తులను ముద్దుపెట్టుకోవడం, ముట్టుకోవడం, లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఆయా వ్యక్తుల దగ్గరికి వెళ్లి వస్తే చేతులను శుభ్రంగా కడగాలి. తప్పనిసరిగా మాస్క్‌ను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.