పాట్నా: బీహార్‌లో అధికార జేడీ(యూ), బీజేపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమిని దించి ఈసారి ఎలాగైనా అధికారం చేపడదామని కలలు కంటున్న కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల మహాఘట్బంధన్లో ఐక్యత కరవైంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన లిస్టుల్లో చిత్రంగా 11 స్థానాల్లో ఈ పార్టీలు పరస్పరం తలపడుతున్నాయి. ఇందులో ఆరు స్థానాల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ నేరుగా పోటీపడుతుండగా, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ రంగంలో ఉన్నాయి. అలాగే ముఖేష్ సహానీకి చెందిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), ఆర్జేడీలు రెండు నియోజకవర్గాల్లో ఢీకొంటున్నాయి. అయితే తమ మధ్య ఉన్నది స్నేహపూర్వక పోటీ అని ఈ కూటమి పార్టీలు సమర్థించుకుంటున్నాయి.
ఎన్డీఏకే ప్రయోజనమా?
ఇలా విపక్ష కూటమిలో లుకలుకల వల్ల వ్యతిరేక ఓటు చీలి బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ కూటమికి పలు నియోజకవర్గాల్లో ప్రయోజనం చేకూర్చవచ్చునని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహాఘట్బంధన్లోని విభేదాలు సవాల్ విసిరే కొన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి విజయాన్ని సులభం చేస్తుందని ఆ కూటమి భాగస్వామి పార్టీ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ‘ఇంత పెద్ద కూటమి విడిపోయే దశలో ఉండటం నేనెక్కడా చూడలేదు.
సీట్ల సర్దుబాటుపై కొద్దిపాటి వివాదాలు, విభేదాలు సహజమే. కానీ ఆయా పార్టీలు కూర్చుని ఎవరెక్కడ పోటీ చేయాలనే దానిపై ఒక అవగాహనకు రావాలి. కానీ మహాఘట్బంధన్లో ఇది కన్పించడం లేదు’ అని అన్నారు. బీహార్ ఎన్నికల నుంచి తప్పుకున్న జేఎంఎం‘మహాఘట్బంధన్’లో కాంగ్రెస్, ఆర్జేడీ తీరుతో విసిగిపోయిన జేఎంఎం కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోవటం లేదని మంగళవారం ప్రకటించింది. సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆర్జేడీతో వచ్చిన విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జార్ఖండ్ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సొరేన్ వెల్లడించారు.
విపక్ష అభ్యర్థులకు బీజేపీ బెదిరింపులు: ప్రశాంత్ కిషోర్
ఓటమి భయంతో పోటీ నుంచి తప్పుకోవాలని విపక్ష అభ్యర్థులను బీజేపీ బెదిరిస్తున్నదని ‘జన్ సురాజ్’ నాయకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, బీజేపీ తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే జన్ సురాజ్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్నారు.
బీహార్ ఎన్నికలకు కర్ణాటక మంత్రుల నిధుల సేకరణ!
బెంగళూరు: బీహార్ శాసన సభ ఎన్నికల కోసం కర్ణాటక మంత్రులు నిధులు సేకరిస్తున్నారని బీజేపీ ఎంపీలు జగదీశ్ శెట్టర్, రాఘవేంద్ర సోమవారం ఆరోపించారు. ఈ నిధుల సేకరణలో సీఎం, మంత్రులు ఉండటం అధికార యంత్రాంగంలో అవినీతికి కారణమైందని వారు తెలిపారు. ‘బీహార్ ఎన్నికల నిధుల కోసం మంత్రులంతా అధికారుల ద్వారా దోచుకుంటున్నారు. డబ్బులు వసూలు చేయాలని వారు అధికారులను అడిగారు. బదిలీల ద్వారా డబ్బు సేకరించిన తర్వాత, ఇప్పుడు రెన్యువల్స్ పేరు మీద వసూలు చేస్తున్నారు. ఇది వాళ్ల ప్రధాన వ్యాపారంగా మారింది’ అని శివమొగ్గలో మీడియాతో మాట్లాడుతూ రాఘవేంద్ర అన్నారు.