ముంబై, జూలై 30: మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను వెళ్లగొడితే ముంబై, థానె లాంటి నగరాల్లో డబ్బులే ఉండవని అన్నారు. అంథేరీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోశ్యారీ.. గుజరాతీలు, రాజస్థానీలు ముంబైని విడిచివెళ్లిపోతే ఈ నగరం ఆర్థిక రాజధానిగా ఉండబోదని, ఇక్కడ డబ్బే మిగలదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అధికార, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కోశ్యారీ వ్యాఖ్యలను ఎట్టిపరిస్థితుల్లో సమర్థించే ప్రసక్తే లేదని తెలిపాయి. గవర్నర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్, శివసేన నేతలు డిమాండ్ చేశారు. అయితే, గవర్నర్ వ్యాఖ్యలను వక్రీకరించారని.. ముంబైని ఆర్థిక రాజధానిగా మార్చటంలో గుజరాతీలు, రాజస్థానీలు అంది ంచిన సహకారాన్ని కొనియాడారని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
గవర్నర్ వ్యాఖ్యలను సమర్థించను: ఏక్నాథ్
కోశ్యారీ వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ఆ వ్యాఖ్యలను సమర్థించబోనని స్పష్టం చేశారు. ముంబై అభివృద్ధిలో మరాఠా ప్రజల పాత్ర విస్మరించలేనిదని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయం చెప్పారని అన్నారు. ముంబై అభివృద్ధికి ముంబైవాసులు, మరాఠా ప్రజలు చేసిన కృషి మరువలేదని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని చురక అంటించారు. ముంబైని, మరాఠీ ప్రజలను ఎవరూ చులకనగా చూడ్డానికి వీల్లేదని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ముంబై నిలబడిందని వెల్లడించారు.
ఇంటికి పంపాలా? జైలుకా: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై, థానెల్లో ఉన్న హిందువుల మధ్యన గవర్నర్ కోశ్యారీ విభజన కుట్ర చేస్తున్నారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘మరాఠా ప్రజల పట్ల గవర్నర్ మనసులో ఉన్న విద్వేషం ఆయన వ్యాఖ్యలతో బయటపడింది. కోశ్యారీని ఇంటికి పంపించాలా? జైలుకు పంపించాలా? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గత మూడు సంవత్సరాలుగా మరాఠీ మాట్లాడే ప్రజలను కోశ్యారీ తీవ్రంగా అవమానిస్తూనే ఉన్నారు. మహారాష్ట్రలో ఉంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కోశ్యారీ వ్యాఖ్యలు మరాఠాల సామర్థ్యాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఇంతకంటే దురదృష్టకరం మరొకటి ఉండదు.
– మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్
మహారాష్ట్ర, ముంబై ఏర్పాటులో మరాఠా ప్రజలదే ప్రముఖ పాత్ర. వారు లేకుండా మహారాష్ట్ర ఈ స్థాయిలో ఉండలేదు.
– ఎన్సీపీ నేత అజిత్ పవార్
మరాఠా ప్రజలు, మహారాష్ట్రీయులు బిచ్చగాళ్లు అయ్యండేవారు అన్న రీతిలో గవర్నర్ కోశ్యారీ వ్యాఖ్యలు ఉన్నాయి.
– శివసేన ఎంపీ సంజయ్ రౌత్
మహారాష్ట్ర అభివృద్ధిలో మరాఠా ప్రజలది కీలక పాత్ర. గవర్నర్ వ్యాఖ్యలతో ఏకీభవించం
– మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
నేను ప్రజలకు ఒక మాట చెప్పదలచుకొన్నా..
మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానె నగరాల నుంచి గుజరాతీలను, రాజస్థానీలను వెళ్లగొడితే..
మీ దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలదు.అంతేకాదు.. ఇకపై ముంబై దేశ ఆర్థిక రాజధానిగా కూడా మనుగడ సాగించలేదు.
-మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ