చెన్నై: మద్రాసు హైకోర్టు(Madras High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్ల మైనర్ బాలిక గర్భం దాల్చిన కేసులో తీర్పు ఇచ్చింది. 28 వారాల ప్రెగ్నెన్సీ తొలగించాలని ప్రభుత్వ నమ్మక్కల్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి ఆదేశాలు జారీ చేసింది. మైనర్ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశారు. అయితే ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రెగ్నెన్సీ తొలగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టుకు చెందిన వెకేషన్ బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది. మైనర్లు గర్భం దాల్చడాన్ని ఇటీవల సుప్రీంకోర్టు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఇలాంటి కేసులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొత్త చట్టాన్ని రూపొందించాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది. పాత చట్టాల ప్రకారం మైనర్లు తమ గర్భాన్ని తొలగించుకునేందుకు 20 వారాల వరకు అనుమతి ఉన్నది.
అయితే తమిళనాడు కేసులో బాధితురాలి తల్లి మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 12 ఏళ్ల తన కూతుర్ని ఓ నిందితుడు రేప్ చేసినట్లు ఆమె పేర్కొన్నది. బీఎన్ఎస్ సెక్షన్ 87 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. 2021 పోక్సో చట్టంలోని సెక్షన్ 5 (m), 5 (l), 5 (j) (ii) మరియు 6 కింద కేసు బుక్ చేశారు. ప్రస్తుతం ఆ మైనర్ గర్భం దాల్చి 28 వారాలు అవుతోంది. ఆ అమ్మాయికి ప్రభుత్వ నమ్మకల్ మెడికల్ కాలేజీలో చికిత్స జరుగుతోంది. అయితే ప్రెగ్నెన్సీ తొలగించేందుకు ప్రభుత్వ అనుమతి కావాలని తల్లి తన పిటీషన్లో కోరింది.
మద్రాసు హైకోర్టు జస్టిస్ ఎల్ విక్టోరియా గౌరి ఈ కేసులో తీర్పు ఇచ్చారు. ప్రెగ్నెన్సీ తీసివేసేందుకు ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ పాజిటివ్ దిశలో ఆదేశాలు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ప్రభుత్వ వివరణను ఆమోదించిన కోర్టు.. ప్రెగ్నెన్సీ తొలగించాలని ఆదేశిస్తూ, పిటీషన్ను క్లోజ్ చేశారు. ప్రెగ్నెన్సీ తొలగింపు విషయంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. 20 వారాల వరకు ఓ డాక్టర్ అభిప్రాయం ప్రకారం ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయవచ్చు. ఒకవేళ ఆమె మైనర్ అయినా, లేక అత్యాచారానికి గురైన, మానసిక రోగి అయినా, విడాకులు తీసుకున్న వ్యక్తి అయితే, ఆ మహిళ గర్భాన్ని 24 వారాల లోపు తీసి వేసే అవకాశం ఉన్నది. అయితే ఇక 24 వారాలు దాటిన వారి కేసులో.. ఆ బాధితులు పిటీషన్ దాఖలు చేసుకోవాలని, ఆ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం గర్భాన్ని తొలగించుకోవచ్చు.
ఇటీవల సుప్రీంకోర్టు ప్రెగ్నెన్సీ తొలగింపు కేసులో కీలక ఆదేశాలు ఇచ్చింది. 15 ఏళ్ల దివ్యాంగురాలు గర్భం దాల్చింది. ఆమె రేప్ బాధితురాలు. అయితే 30 వారాల ప్రెగ్నెన్సీ తొలగించాలని కోరుతూ ఆమె పిటీషన్ పెట్టుకున్నది. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. రేప్ బాధితుల ప్రెగ్నెన్సీ కేసులను వారంలోనే క్లోజ్ చేయాలన్నారు. కేసులను పెండింగ్లో పెట్టడం వల్ల ఆ బాలిక వేదన భరించాల్సి వస్తుందని కోర్టు చెప్పింది. దీని కోస్ం చట్టాలను సవరించాలని జస్టిస్ తెలిపారు.