High Court | భోపాల్, మార్చి 14: భార్య తన బాయ్‌ఫ్రెండ్స్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని ఏ భర్తా సహించడని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య తీరు క్రూరత్వం కిందకు వస్తుందంటూ ఓ జంటకు విడాకులు మంజూరుచేసింది. 2018లో వివాహం చేసుకున్న ఓ వ్యక్తి, మగ స్నేహితులతో తన భార్య కొనసాగిస్తున్న సంబంధాల్ని, వాళ్లతో చేస్తున్న అసభ్యకరమైన మొబైల్ చాటింగ్‌ను కోర్టు ముందు ఉంచుతూ విడాకులు కోరాడు. దీంతో దిగువ కోర్టు విడాకులు మంజూరు చేయగా, దానిపై భార్య హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా కేసును విచారిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.
మగ స్నేహితులతో భార్య తన లైంగిక విషయాల్ని చాటింగ్ చేయడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. విడాకులు మంజూరు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ‘భార్య లేదా భర్త, బయటి వ్యక్తులతో లైంగిక విషయాలపై మాట్లాడే తీరు లేదా మొబైల్ చాటింగ్ మర్యాదగా, గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామికి అది అభ్యంతరకరం కాకూడదు’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.