Kamalnath | న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అనుహ్య పరిణామానికి కారణం.. రాజ్యసభ టికెట్ కారణమని తెలుస్తోంది. తనను రాజ్యసభకు నామినేట్ చేయాలని కమల్ నాథ్ కాంగ్రెస్ పార్టీని కోరగా, ఆ ప్రతిపాదనను పార్టీ అగ్రనాయకత్వం సున్నితంగా తిరస్కరించినట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడంతోనే కమల్ నాథ్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కమల్ నాథ్‌తో పాటు ఆయన కుమారుడు నకుల్‌నాథ్ కూడా కమలం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి చేసిన ఓ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో కమల్‌నాథ్‌కు మీడియా అడ్వైజర్‌గా చేసిన నరేంద్ర సలూజా.. ఎక్స్ అకౌంట్లో కమల్‌నాథ్, నకుల్‌నాథ్ ఫోటోను పోస్టు చేశాడు. దానికి జై శ్రీరామ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. మరో వైపు నకుల్‌నాథ్ తన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ నుంచి కాంగ్రెస్ పదాన్ని తీసేశారు. ప్రస్తుతం ఆయన చింద్వారా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు.