బెంగుళూరు: చెన్నైకి చెందిన మ్యూజిక్ అకాడమీ కొన్నాళ్లుగా ప్రఖ్యాత గాయని దివంగత ఎంఎస్ సుబ్బలక్ష్మీ(M S Subbulakshmi Award) పేరటి అవార్డును అందజేస్తున్నది.అయితే ఆ మ్యూజిక్ అకాడమీ ఈసారి ఆ అవార్డును టీఎం కృష్ణకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనిపై ఎంఎస్ సుబ్బలక్ష్మీ మనవడు వీ శ్రీనివాసన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎం కృష్ణకు అవార్డు ఇవ్వవద్దు అంటూ మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశారు. టీఎం కృష్ణకు అవార్డు ఇవ్వడం అంటే, ఓ భక్తి ప్రైజ్‌ను నాస్తికుడికి ఇవ్వడం అవుతుందని సుబ్బలక్ష్మీ మనవడు ఆరోపించారు. గతంలో గాయని సుబ్బలక్ష్మీపై టీఎం కృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2004లో సుబ్బలక్ష్మీ మరణం తర్వాత ఆమె పేరిట 2005 నుంచి సంగీత కళానిధి అవార్డును అందిస్తున్నారు. ఆ అవార్డు కింద లక్ష ప్రైజ్‌మనీ ఇస్తున్నారు. కర్నాటక మ్యూజిక్‌లో గొప్ప గేయని అయిన సుబ్బలక్ష్మిని కృష్ణ అనేకసార్లు తీవ్రంగా విమర్శించారని, అలాంటి వ్యక్తిని ఎలా ఆమె అవార్డుతో సత్కరిస్తారని శ్రీనివాసన్ ప్రశ్నించారు. సుబ్బలక్ష్మి వీలునామా ప్రకారం ఎటువంటి స్మారక సంస్థ ఉండకూడదని, ఆమె పేరిట ఫండ్‌ను ఏర్పాటు చేయడాన్ని కూడా వ్యతిరేకించినట్లు శ్రీనివాసన్ తెలిపారు.