Sanjay Raut : మహారాష్ట్ర (Maharastra) లో త్రిభాషా విధానం (Three Language Policy) పై అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని అమలు చేసేందుకు అధికారపక్షం ప్రయత్నాలు చేస్తుండగా.. తాము వ్యతిరేకమని ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నాయి. ఈ క్రమంలో త్రిభాషా విధానంపై గతంలో మాషేల్కర్ కమిటీ (Mashelkar Committee) ఇచ్చిన నివేదికకు యూబీటీ శివసేన (Shiv Sena – UBT) పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే (Uddav Thackeray) అంగీకారం తెలిపారని బీజేపీ ఆరోపించింది.
అయితే బీజేపీ ఆరోపణలను యూబీటీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. అబద్ధాలు మాట్లాడటం బీజేపీ జాతీయ విధానంగా మారిపోయిందని, మహారాష్ట్రలో వాళ్లు ఈ విధానంతోనే పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. మాషేల్కర్ కమిటీ నివేదికకు ఉద్ధవ్ థాకరే అంగీకారం తెలిపి ఉంటే అందుకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టవచ్చుగా అని మండిపడ్డారు.
అసలు మాషేల్కర్ నివేదిక నాడు క్యాబినెట్ ముందుకు వచ్చిందా.. క్యాబినెట్లో దానిపై చర్చ జరిగిందా..? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఏదైనా జాతీయ విధానం రాష్ట్రం ముందుకు వచ్చినప్పుడు దానిపై చర్చ జరగడం అనేది చాలా ముఖ్యమని, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఈ విషయం కూడా తెలియదా..? అని రౌత్ ప్రశ్నించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మహారాష్ట్రలోని ప్రాథమిక పాఠశాలల్లో కూడా హిందీని ఒక బోధనా భాషగా ప్రవేశపెట్టాలని ఫడ్నవీస్ సర్కారు ప్రయత్నిస్తోంది. అయితే ప్రాథమిక పాఠశాల స్థాయిలో హిందీని బలవంతంగా ఒక బోధనా భాషగా చేర్చడం కరెక్టు కాదని ప్రతిపక్ష శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగుతున్నాయి.