BJP | లక్నో, మే 11: లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. యూపీలో 13 సీట్లకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 2019 ఎన్నికల్లో అవధ్, బుందేల్‌ఖండ్ రీజియన్లలో గెలుచుకొన్న ఈ అన్ని స్థానాలను తిరిగి నిలబెట్టుకోవడం అధికార బీజేపీకి సవాల్‌గా మారింది. రాష్ట్రంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఎస్పీ, కాంగ్రెస్ కూటమి.. ఈసారి ఎలాగైనా కమలం పార్టీకి గట్టి ఝలక్ ఇవ్వాలని ముమ్మర ప్రచారం నిర్వహించాయి. యూపీలోని షాజహాన్‌పూర్, లఖింపూర్ ఖేరీ, ధౌర్హర, సీతాపూర్, హర్దోయ్, మిస్రిఖ్, ఉన్నావో, ఫరూఖాబాద్, ఇథవా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్పూర్, బహ్రైచ్ స్థానాల్లో నాలుగో దశ పోలింగ్ జరుగుతుంది. కాన్పూర్, బహ్రైచ్ స్థానాలను మినహా మిగతా చోట్ల బీజేపీ సిట్టింగ్‌లకే టికెట్లు ఇచ్చింది.
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ ఉద్యమంలో లఖింపూర్ ఖేరీ ఘటన ఒక విషాదంగా నిలిచిన విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేసినా మోదీ సర్కార్ పట్టించుకోకపోవడంపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఈ స్థానం నుంచి అజయ్ మిశ్రాకే బీజేపీ టికెట్ ఇవ్వడం గమనార్హం. ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. లఖింపూర్ ఖీరీలో ఎస్పీ అభ్యర్థిగా ఉత్కర్ష్ వర్మ పోటీచేస్తున్నారు.
కన్నౌజ్ లోక్‌సభ స్థానం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ బీజేపీ అభ్యర్థి సుబ్రత్ పాఠక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి కన్నౌజ్ నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీచేస్తుండటం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి ఈసారి కూడా సుబ్రత్ పాఠక్నే బరిలో ఉండటం గమనార్హం. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా ఇమ్రాన్ పోటీచేస్తున్నారు. మరోవైపు కాన్పూర్ నియోజకవర్గంలో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీల తరపున కొత్త ముఖాలు బరిలో నిలిచాయి. బహ్రైచ్‌లో సిట్టింగ్ ఎంపీ అక్షయ్వార్ లాల్ గోండ్ స్థానంలో ఆయన కుమారుడు ఆనంద్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది.