Shantanu Sinha Biswas : కోల్కతా డీసీపీ శంతను సిన్హా బిశ్వాస్పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఈడీ నోటీసులు ఇచ్చింది. శంతను దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అతడికి ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ అతడు హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.
ఈడీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్లర్లు, హత్యాయత్నం, నేర కుట్రలకు సంబంధించి కోల్కతాకు చెందిన సోనా పప్పు అనే వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దోపిడీ కోణం ఉన్న నేపథ్యంలో ఇది మనీ లాండరింగ్ కేసుగా మారింది. ఈ కేసులో శంతను సిన్హా బిశ్వాస్కు ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ జరిపే క్రమంలో కోల్కతాలోని బాల్లీగంజ్ ప్రాంతంలోని బిశ్వాస్ ఇంటిపై ఈడీ అధికారులు గత నెలలో విచారణ కూడా జరిపారు. అతడి కొడుకులు ఇద్దరి ప్రమేయంపైనా ఆరోపణలున్నాయి.
దీంతో అతడి కొడుకులు సయంతను, మనీష్లకు కూడా సమన్లు జారీ చేశారు. వారు కూడా విచారణకు హాజరు కాలేదు. అనంతరం ఈ కేసులో విచారణ జరిపేందుకు శంతను బిశ్వాస్ సిన్హాకు కూడా ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే, వాటికి అతడు స్పందించలేదు. ఇలా అనేకసార్లు నోటీసులకు స్పందించకపోవడంతో అతడిపై ఈడీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీచేశారు.