Criminal Law Bills | బ్రిటిష్‌కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్రం కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను తీసుకువచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టిన కొన్ని కొత్త సవరణలతో పాటు బిల్లుకు ఆమోదించింది.
మూడు బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఆయా బిల్లులపై బుధవారం లోక్‌సభలో చర్చ జరిగింది. భారీగా సభ్యులు సస్పెండ్ అయిన తర్వాత బిల్లులకు ఆమోదముద్ర పడింది. గతంలో ప్రతిపక్ష నాయకులు అధిర్ రంజన్ చౌదరి, సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ తదితర ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. అయితే, అధికార భారతీయ జనతా పార్టీ (BJP), మిత్రపక్షాలు బిల్లులను సమర్థించాయి. బిల్లులపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్‌షా మాట్లాడారు.
భారతీయ శిక్షాస్మృతి స్థానంలో కొత్తగా తీసుకువస్తున్న భారతీయ న్యాయ సంహిత శిక్ష కంటే న్యాయంపై దృష్టి పెడుతుందన్నారు. ప్రతిపాదిత మూడు క్రిమినల్ చట్టాలు ప్రజలను వలసవాద మనస్తత్వం, దాని చిహ్నాల నుంచి విముక్తం చేస్తాయన్నారు. అయితే, బిల్లులపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. కొత్త బిల్లులు ఎవరిపై అయినా చర్యలు తీసుకునేలా అధికారాన్ని పోలీసులకు కల్పిస్తున్నాయన్నారు. దాంతో ప్రజల పౌరహక్కులు, హక్కులకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు దేశంలోని సామాన్య ప్రజలకు వ్యతిరేకమన్నారు.