బెంగళూరు, సెప్టెంబర్ 17: స్టార్టప్‌ల హబ్‌గా పేరొందిన బెంగళూరు ప్రతిష్ట అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌తో మసక బారుతోంది. ఈ పరిస్థితులకు విసిగివేసారిన బ్లాక్‌బక్ అనే లాజిస్టిక్స్ స్టార్టప్ కంపెనీ నగరంలోని ఔటర్‌రింగ్ రోడ్ ప్రాంతం నుంచి తన కార్యాలయాన్ని తరలిస్తున్నది. ఘోరమైన గోతులతో నిండిన రోడ్లు, గంటల తరబడి ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్‌లు, ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పట్టడం తమ కార్యాలయ తరలింపునకు ప్రధాన కారణాలని నిర్వాహకులు ప్రకటించారు. పలు టెక్నాలజీ సంస్థలకు, స్టార్టప్‌లకు కేంద్రంగా ఉన్న బెల్లందూర్‌లోని ఓఆర్ఆర్ రోడ్ ప్రాంతంలో తన కార్యాలయాన్ని తొమ్మిదేండ్ల క్రితం ఏర్పాటు చేసినట్టు సంస్థ సీఈవో రాజేశ్ యబాజీ తెలిపారు.
అయితే నగరంలో రోజురోజుకు మౌలిక సదుపాయాలు దిగజారుతున్నాయని, రోడ్లన్నీ అడుగు లోతుకు పైగా గోతులతో నిండి ఉన్నాయని, తమ ఉద్యోగులు కార్యాలయానికి రావడానికి గంటన్నరకు పైగా సమయం పడుతున్నదని చెప్పారు. నగరమంతా దుమ్ముతో నిండిపోతున్నదని, రానున్న ఐదేండ్లలో కూడా ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కన్పించకపోవడంతో తాను కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. బ్లాక్‌బక్ ప్రకటనతో కాంగ్రెస్ సర్కారుపై పారిశ్రామిక వేత్తలు ధ్వజమెత్తారు. ఇది పాలనా వైఫల్యమేనని కిరణ్మజుందార్ షా, మోహన్‌దాస్ పాయ్ తదితరులు మండిపడ్డారు.
గుంతలు పూడిస్తే ఐఫోన్
సిలికాన్ సిటీ బెంగళూరు రోడ్ల దుస్థితిపై విసిగిపోయిన ప్రజల నిస్సహాయతను శిఖర్ అనే ఓ స్టార్టప్ కంపెనీ ఫౌండర్ వినూత్నంగా వెలుగులోకి తెచ్చారు. తన నివాస ప్రాంతంలోని గుంతలమయంగా మారిన రోడ్ల ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేస్తూ ‘ఈ ఫొటోలు మా వీధిలో ఉన్న గుంతలకు సంబంధించినవి. మూడేండ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో ప్రజలు కూడా ఆశలు వదులుకున్నారు. దీనిపై ఎవరైనా ప్రభుత్వాన్ని కదిలించగలిగితే నేను వారికి ఐఫోన్ బహుమతిగా ఇస్తాను’ అని అందులో రాసుకొచ్చారు.