ఫతేహాబాద్, ఆగస్టు 1: గత వారం రోజులుగా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్థులు ఏకంగా విద్యుత్తు కార్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా హుక్మావలి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. తక్షణమే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించకపోతే పవర్ స్టేషన్‌ను నిప్పుపెడుతామని గ్రామస్థులు హెచ్చరించారు. సోమవారం పవర్ స్టేషన్ ముందు వారు ధర్నా నిర్వహించారు. ‘గ్రామంలో 220కేవీ సబ్‌స్టేషన్ నిర్మించేందుకు 14 ఎకరాల భూమి ఇచ్చాం. బదులుగా 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే గత 5-7 రోజులుగా గ్రామంలో కరెంట్ లేదు. రాత్రి పూట కూడా ఉండటం లేదు.
అధికారులను కలిసి పదేపదే సమస్యను విన్నవించినా పరిష్కారం లభించలేదు. విద్యుత్తు పునరుద్ధరించే వరకు ధర్నా కొనసాగిస్తాం’ అని రామ్‌సింగ్ అనే గ్రామస్థుడు తెలిపారు. ‘రాత్రి పూట కూడా కరెంట్ లేకపోవడంతో పిల్లలకు అసలు నిద్ర ఉండటం లేదు. ఇప్పటికైనా అధికారులు మా గోడు వినిపించుకోకపోతే పవర్ స్టేషన్‌కు నిప్పుపెడతాం’ అని బల్బీర్‌సింగ్ అనే మరో గ్రామస్థుడు హెచ్చరించారు. అయితే భారీ వర్షాల కారణంగా ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిందని, అందుకే విద్యుత్తు సమస్య తలెత్తినట్టు అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.