న్యూఢిల్లీ, జూన్ 5: మొట్టమొదటిసారిగా అంగారక గ్రహంపై నుంచి లైవ్ వీడియో స్ట్రీమింగ్‌ను నిర్వహించినట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో ఫీడ్ 17 నిమిషాల్లోనే భూమికి చేరుకున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. యూరోప్‌కు చెందిన మార్స్ ఎక్స్‌ప్రెస్ శాటిలైట్‌తో శాస్త్రవేత్తలు లైవ్ వీడియో స్ట్రీమింగ్‌ను నిర్వహించారు. అంగారకుడి నుంచి ఒక్కో చిత్రం భూమికి చేరేందుకు 17 నిమిషాల సమయం పట్టినట్టు వారు పేర్కొన్నారు. మార్స్ ఎక్స్‌ప్రెస్‌లోని విజువల్ మానిటరింగ్ కెమెరాను వెబ్‌క్యామ్‌గా వినియోగించి ఈ లైవ్ స్ట్రీమింగ్‌ను నిర్వహించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అంగారకుడిపై పరిశోధనలు చేసేందుకు మార్స్ ఎక్స్‌ప్రెస్‌ను 2003లో ప్రయోగించారు.