న్యూఢిల్లీ : డిజిటల్ ఆస్తుల మార్కెట్లో చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా భారత ఆర్థిక నిఘా యూనిట్(ఎఫ్ఐయూ) నిబంధనలను కఠినం చేసింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీల ప్రక్రియను భౌగోళికంగా ట్రాక్ చేసేందుకు యూజర్లు లైవ్ సెల్ఫీ వీడియో, జియో ట్యాగింగ్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త మనీలాండరింగ్ నిరోధక, నో యువర్ కస్టమర్ ప్రొటోకాల్స్‌ను జారీ చేసింది.
ఈ నెల 8న జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం.. వర్చువల్ డిజిటల్ ఆస్తుల సేవలను అందించే క్రిప్టో ఎక్స్ఛేంజీలు ఖాతాదారులు లైవ్ సెల్ఫీ వీడియో, జియో ట్యాగింగ్ చేశారో, లేదో పరిశీలించాలి. ప్రజలు తమ క్రిప్టో కరెన్సీ ఖాతాల ప్రారంభానికి వాడిన చిరునామా, తేదీ, ఐపీ అడ్రస్, టైమ్‌స్టాంప్‌ను తప్పనిసరిగా తనిఖీ చేసి వాటి వివరాలు నమోదు చేయాలి. పెన్నీ డ్రాప్ పద్ధతిలో నామమాత్రంగా రూ.1 లావాదేవీ జరిపి వారిది సరైన బ్యాంక్ ఖాతా అవునో కాదో ధ్రువీకరించుకోవాలి.