చెన్నై: తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ‘విశ్వాసం ఉన్నవారికి’ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. డీఎంకే ప్లాటినం జూబ్లీ వేడుకల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన (డీఎంకే) ప్లాటినమ్ జూబ్లీ వేడుకలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే విశ్వాసంతో జరుపుకునే వారికి ‘దీప ఒలి తిరునాల్’ (దీపావళి శుభాకాంక్షలు)’ అని అన్నారు. బీజేపీ నేత నారాయణన్ తిరుపతి దీనిపై స్పందించారు. ‘నమ్మకం లేని వారు నరకాసురుడిలా జీవించాలని నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా, రాముడు అరణ్యవాసం పూర్తి చేసి సీతాదేవితో అయోధ్యకు తిరిగి రావడానికి సూచనగా ఉత్తరాది భారత్లో దీపావళిని జరుపుకుంటారు. అయితే రాక్షస రాజైన నరకాసురుడిపై శ్రీకృష్ణుడు, సత్యభామ సాధించిన విజయానికి గుర్తుగా దక్షిణ భారతీయులు దీపావళిని జరుపుకుంటారు.
మరోవైపు ‘హేతువాద’ విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించే డీఎంకే నేతలు సాధారణంగా పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు దూరంగా ఉంటారు. దివంగత నేత ఎం కరుణానిధి కూడా ఎప్పుడూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పలేదు. అయితే దీనికి భిన్నంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వాసం ఉన్నవారికి’ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. కాగా, హిందువుల పండుగలను విస్మరిస్తున్నారంటూ డీఎంకేపై బీజేపీ తరచుగా మండిపడుతున్నది.