చిన్నపిల్లల చేష్టలు భలేగా ఉంటాయ్. కొందరు పిల్లలు హైపర్యాక్టివ్గా ఉంటారు. ఉన్నచోట ఉండరు. బయటకు వెళ్తే వీళ్లను ఆపడం చాలా కష్టం. ముద్దు ముద్దుగా ఉండడంతోపాటు కొంటె పనులు చేస్తుంటారు. అలాంటి ఓ చిన్నారి, మహిళా పోలీస్తో గొడవపడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్ల మనసు దోచుకుంటున్నది.
ఈ వీడియోను ‘కనిష్క బిష్ణోయ్’ అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోను ముంబైలో చిత్రీకరించారు. రెండేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి బయటకు వచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న మహిళా పోలీస్ వద్దకు పరుగెత్తుకెళ్లింది. ఆమె చేతిలోని లాఠీ ఇవ్వాలని మారాం చేసింది. ఆమె అందమైన చేష్టలు మహిళా పోలీసుతోపాటు అక్కడున్నవారందరికీ నవ్వు తెప్పించింది. నెటిజన్లు లవ్ ఎమోజీలతో కామెంట్ బాక్స్‌ను నింపేశారు. ఈ వీడియో ఇప్పటివరకూ ఏడు లక్షలకుపైగా లైక్‌లను సొంతం చేసుకున్నది.