భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పుణ్య క్షేత్రాల్లో మద్యం నిషేధం(Liquor Ban) అమలులోకి తెచ్చారు. మంగళవారం నుంచి పలు పట్టణాల్లో లిక్కర్‌పై బ్యాన్ విధించారు. జ్యోతిర్లింగ క్షేత్రాలైన ఉజ్జయిని, ఓంకారేశ్వర్తోపాటు మాహేశ్వర్, మైహర్ పట్టణాల్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. వీటితో పాటు మొత్తం 19 మతపరమైన పట్టణాలు, ప్రాంతాల్లో, గ్రామ పంచాయతీల్లో బ్యాన్ ఉంటుంది. తమ ప్రభుత్వ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
జనవరి 24వ తేదీన సీఎం మోహన్ యాదవ్.. లిక్కర్ బ్యాన్ నిర్ణయాన్ని ప్రకటించారు. దానికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. మహేశ్వర్ పట్టణంలో ఆ మీటింగ్ జరిగింది. తాజా నిర్ణయం ప్రకారం లిక్కర్ షాపులు, బార్లను మూసివేయనున్నారు. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మాహేశ్వర్, మండలేశ్వర్, ఓర్చా, మైహర్, చిత్రకూట్, దాటియా, పన్నా, మండలా, ముల్తాయి, మందసౌర్, అమర్కాంతక్లోని పట్టణ ప్రాంతాల్లో వైన్ షాపులు, బార్లను మూసివేయనున్నారు. సల్కాన్‌పూర్, కుండల్పుర్, బండక్పుర్, బర్మన్కలన్, బర్మన్కుర్ద్, లింగా గ్రామ పంచాయతీ పరిధిలో కూడా మద్యం అమ్మకాలు ఉండవు.
రాష్ట్రంలోని 19 అర్బన్, రూరల్ ప్రాంతాలు పూర్తిగా పవిత్రమైనవని ఇటీవల బీజేపీ సర్కారు ప్రకటించింది. ఆ తీర్మానం ప్రకారమే మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. డీ అడిక్షన్ దిశగా ఇది చరిత్రాత్మక అడుగు అని సీఎం యాదవ్ చెప్పారు. దైవ క్షేత్ర ప్రదేశాల్లో విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం జరుగుతోందన్నారు.
లిక్కర్ బ్యాన్ విధించిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఉజ్జయిని ఉంది. ఈ పట్టణంలో మహాకాలేశ్వర్ ఆలయం ఉన్నది. ఇక నర్మదా నది పుట్టిన అమర్‌కాంతక్ పట్టణంలో కూడా నిషేధాన్ని విధించారు.