అయోధ్య: అయోధ్య(Ayodhya)లో రామాలయ నిర్మాణం నేపథ్యంలో సుందరీకరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. భక్తి పాథ్, రామ్ పాథ్ మార్గంలో అత్యంత ఖరీదైన వీధి విద్యుత్తు లైట్లను అమర్చారు. సుమారు 50 లక్షల ఖరీదైన ఆ లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. 3800 బాంబూ, 36 ప్రొజెక్టర్ లైట్లను అపహరించినట్లు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. హై సెక్యూర్టీ ఏరియా నుంచి ఆ లైట్లను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. రామ జన్మభూమి పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు 9వ తేదీన యశ్ ఎంటర్ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ ఆ ఫిర్యాదును నమోదు చేశారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ తో ఆ కాంట్రాక్టు జరిగింది.
రామ్పాథ్ రూట్లో సుమారు 6400 బాంబూ లైట్లను అమర్చారు. భక్తిపాథ్ రూట్లో 96 ప్రొజెక్టర్ లైట్లను అమర్చారు. మార్చి 19వ తేదీ వరకు అన్ని లైట్లు ఉన్నాయి. కానీ మే 9వ తేదీన జరిగిన ఇన్స్పెక్షన్ తర్వాత కొన్ని లైట్లు మిస్ అయినట్లు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇప్పటి వరకు 3800 బాంబూ లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లను దొంగలించారని ఓ కంపెనీ ప్రతినిధి శేఖర్ శర్మ తెలిపారు.
మే నెలలో దొంగతనం జరిగినట్లు గుర్తించినా.. ఫిర్యాదు ఆగస్టు 9వ తేదీన నమోదు చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జనవరి 22వ తేదీన నూతనంగా నిర్మించిన రామాలయాన్ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో అయోధ్యలో విద్యుత్తు లైట్లను అమర్చారు.