Life Term : తల్లిమీద కోపంతో ఆమె కొడుకుకు మ్యారేజ్ గిఫ్ట్ (Marriage gift) గా పార్సిల్ బాంబు (Parcel Bomb) పంపి ఇద్దరి మరణానికి కారణమైన వ్యక్తికి ఒడిశా (Odisha) లోని బొలాంగిర్ జిల్లా (Bolangir district) కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష (Life term) విధించింది. 2018 నాటి ఈ కేసులో ఇవాళ (బుధవారం) విచారణ జరిపిన ప్రతాప్‌గఢ్ అడిషనల్ జిల్లా జడ్జి.. నిందితుడు పంజీలాల్ మెహర్‌ను దోషిగా తేల్చారు. అతడికి జీవితఖైదు విధించడంతోపాటు రూ.1.70 లక్షల జరిమానా విధించారు.
వివరాల్లోకి వెళ్తే.. పంజీలాల్ మెహర్ భైన్సాలోని జ్యోతి వికాస్ కాలేజీలో లెక్చరర్‌గా విధులు నిర్వహించేవాడు. అదే కాలేజీలో సంయుక్త సాహు అనే మహిళ ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు. అయితే ఈ ఇద్దరి మధ్య వృత్తిగతమైన తగాదా ఉంది. దీన్ని మనసులో పెట్టుకున్న మెహర్.. సంయుక్త సాహు కొడుకు పెళ్లిని ఆసరాగా చేసుకుని పెళ్లికొడుకును చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
అందుకోసం మ్యారేజ్ గిఫ్టుగా పార్సిల్ బాంబును పంపించాడు. ఆ పార్సిల్ ఓపెన్ చేయగానే బాంబు పేలడంతో సంయుక్త సాహు కుమారుడు పెళ్లికొడుకు అయిన సౌమ్య సాహు ప్రాణాలు కోల్పోయాడు. అతడితోపాటు అతడి నానమ్మ కూడా మృతిచెందింది. పెళ్లికుమార్తెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 2018 ఫిబ్రవరి 23న ఘటన జరుగగా అదే ఏడాది మార్చి 23న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 2018 ఏప్రిల్‌లో మెహర్‌ను అరెస్ట్ చేశారు.
అప్పటి నుంచి మెహర్ ప్రతాప్‌గఢ్ సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ విచారణ ఎదుర్కొన్నాడు. తాజాగా స్థానిక కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.1.70 లక్షల జరిమానా విధించింది.