American Scientist | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): భూమి మీద పడగానే పుట్టుక మొదలవుతుందా? లేదా తల్లి కడుపులో పిండం జీవం పోసుకోగానే జననం ప్రారంభమైనట్టా? తుది శ్వాస విడిచాక మరణాన్ని ధ్రువీకరిస్తామా? బ్రెయిన్ డెడ్ అయ్యాక చావును డిసైడ్ చేస్తామా? మనిషి పుట్టుక, చావులోనే ఇన్ని సందేహాలున్నాయి అనుకొంటే.. జీవం, మరణం మాత్రమే కాకుండా మూడో దశ కూడా ఉన్నదని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అసలేమిటీ దశ? దాన్ని ఎలా నిర్ధారించారు?
ఏమిటీ మూడో దశ?
ఏ ప్రాణికి అయినా జీవం, మరణం అనే రెండు దశలే ఉంటాయని ఇప్పటివరకూ అనుకొన్నాం. అయితే, పుట్టుక, చావు మాత్రమే కాదు మూడో దశ కూడా ఉన్నదని పరిశోధకులు చెప్తున్నారు. వివరంగా చెప్పాలంటే.. గుండె కొట్టుకోవడం ఆగిపోయి, శ్వాస తీసుకోలేని స్థితిని చావుగా అర్థం చేసుకొంటాం. అయితే, మనిషి చనిపోయాక కూడా కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. అందుకే అవయవ దానం అనేది సాధ్యపడుతున్నది. అయితే, మనిషి చనిపోయాక కూడా అవయవాలు ఎలా పనిచేయగలుగుతున్నాయన్న దానిపై పరిశోధకులు తాజాగా ప్రయోగాలు చేశారు.
జీవి మరణం తర్వాత కూడా అవయవాల్లోని కొన్ని కణాలు పని చేయడమే దీనికి కారణంగా గుర్తించారు. జీవం, మరణానికి మధ్యనున్న దీన్ని భిన్నమైన మూడో దశగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. మరణించిన జీవి శరీరంలోని ఓ అవయవం నుంచి తీసుకున్న కణాలు.. ఒక మల్టీసెల్యూలర్‌గా ఏర్పడి మళ్లీ జీవం పోసుకోవడానికి అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం ద్వారా ఓ అవగాహనకు వచ్చారు. అదే జరిగితే, ఒకే జీవికి సంబంధించి జననం-మరణం-పునఃజననం అనే చక్రం సాధ్యమయ్యే అవకాశమున్నట్టు తెలిపారు.
ఎలా సాధ్యం?
మనిషి చనిపోయాక కూడా ఆ కణాలు ఎలా పని చేస్తున్నాయి? ఏ మెకానిజం వాటిని అలా పని చేయనిస్తున్నది? అనే ఆసక్తికర చర్చ పరిశోధకుల్లో మొదలైంది. దీంతో మరింత లోతుగా పరిశోధించిన శాస్త్రవేత్తలు చివరకు ఓ నిర్ధారణకు వచ్చారు. మనిషి మరణించినప్పటికీ.. సరైన పరిస్థితుల్లో కణాలను భద్రపరిచినప్పుడు అవి తిరిగి జీవాన్ని పోసుకుంటాయని తేల్చారు. ఈ కణాలకు పోషకాలు, ఆక్సిజన్ అందించినప్పుడు అవి మల్టిసెల్యూలర్ వ్యవస్థగా ఎదుగుతాయని, జీవ క్రియలను కూడా కొనసాగించగలవని తెలిపారు. మూలకణాల నుంచి జీవులను సృష్టించడం ఇదే తరహా విధానమని గుర్తు చేశారు. అంతేకాదు. జీవి మరణించినప్పటికీ ప్రాణంతో ఉండే కణాలు గతంలో తమ సజీవ శరీరంలో ఉన్నప్పుడు చేయలేని కొత్త పనులను కూడా చేయగలవని, వాటి ఆకారంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
కప్పల్లో ఏం జరిగిందంటే?
ప్రయోగంలో భాగంగా చనిపోయిన కప్ప చర్మ కణాలను తీసి ఓ ల్యాబ్‌లో ప్రత్యేక పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు భద్రపరిచారు. ఆ కణాలు జెనోబాట్స్ అనే బహుళ కణ జీవిగా రూపాంతరం చెందడాన్ని గమనించారు. అయితే, కొత్తగా ఏర్పడిన జీవి గతంలో కంటే భిన్నంగా ప్రవర్తించడాన్ని గుర్తించారు. అంటే, కప్ప సజీవంగా ఉన్నప్పుడు స్రవాలను పంప్ చేయడానికి ఉపయోగపడ్డ సిలియా.. జెనోబాట్‌గా మారాక ముందుకు కదలడానికి సాయపడ్డట్టు గమనించారు. ఇక, మరణించిన మనిషి ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలను ప్రత్యేక పరిస్థితుల్లో భద్రపరిస్తే.. అవి సొంతంగా ఒక సూక్ష్మ రూపాన్ని సంతరించుకుని దానికదిగా పనిచేసుకొనేంత శక్తిని సంతరించుకొన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
చావు గుట్టు వీడబోతున్నదా?
‘పుట్టక ముందు నువ్వెవరూ?.. మరణించాక ఏమౌతావు?’ అనే తత్వపరమైన భావాలు, ఆత్మల ఊహాగానాలు, చావు గురించిన రహస్యాలు ఇప్పటివరకూ కథలుగానే ఉన్నాయి కానీ, శాస్త్రీయపరంగా ఎక్కడా రుజువైన దాఖలాలు లేవు. అయితే, పరిశోధకులు తాజాగా గుర్తించిన థర్డ్ స్టేట్‌తో చావు గురించిన గుట్టు ఒక్కొక్కటిగా విడిపోయే అవకాశం ఉన్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.