భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ సవాల్ విసిరారు. ఇద్దరం పరుగు పందెంలో పాల్గొందామని, ఆరోగ్యంగా ఎవరు ఫిట్‌గా ఉన్నారో తెలుస్తుందని అన్నారు. తన ఆరోగ్యం గురించి చౌహాన్ పదే పదే విమర్శలు చేస్తుండటంతో కమల్‌నాథ్ ఆదివారం ఈ మేరకు స్పందించారు.
62 ఏండ్ల సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కన్నా కాంగ్రెస్ మాజీ సీఎం కమల్ నాథ్ 12 ఏండ్లు పెద్ద. ఆయన గత కొద్ది కాలంగా ఢిల్లీలో ఉంటున్నారు. దీంతో కమల్ నాథ్‌కు వయసుపైబడిందని, అనారోగ్యంతో ఆయన ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నారని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల పలు బహిరంగ సభల్లో విమర్శించారు.
కాగా, కమల్ నాథ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ దీనిని ఖండించారు. ‘నా ఆరోగ్యంపై చాలా చర్చలు జరుగుతున్నాయి. వృద్ధుడైన కమల్ నాథ్ జీ అనారోగ్యంతో ఉన్నారని శివరాజ్ జీ చెబుతున్నారు. శివరాజ్ జీ.. నేను మీకు ఒక సవాల్ విసురుతున్నాను. రండి మనం ఒక రేసులో పాల్గొందాం. ఎవరు ఎంత ఫిట్‌గా ఉన్నారో తెలుస్తుంది’ అని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా తనకు చాలా పనులు ఉండటంతో ఢిల్లీలో ఉంటున్నట్లు కమల్ నాథ్ తెలిపారు. అంతేగాని అనారోగ్యం వల్ల విశ్రాంతి కోసం ఢిల్లీలో ఉండటం లేదన్నారు. కరోనా నుంచి కోలుకున్న తాను అనంతరం హెల్త్ చెకప్ చేయించుకున్నానని, అన్ని పరీక్షల రిపోర్టులు బాగానే ఉన్నాయని వివరించారు.
కాగా, సెకండ్ వేవ్‌లో కమల్ నాథ్‌తోపాటు సీఎం శివరాజ్ సింగ్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.