తిరువనంతపురం: జీవితం చివరి అంకంలో ఉన్న వృద్ధులైన భార్యాభర్తలను కలిసి జీవించనివ్వాలని హైకోర్టు పేర్కొంది. (Let Them Live) వేరే మహిళలతో సంబంధం ఉందని ఆరోపించిన భార్యను కత్తితో పొడిచి గాయపర్చిన 90 ఏళ్లు పైబడిన వ్యక్తికి ఊరట ఇచ్చింది. ఆ వృద్ధుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా భార్యాభర్తల అనుబంధాన్ని కోర్టు గుర్తు చేసింది. కేరళలోని కోచిలో ఈ సంఘటన జరిగిందది. మార్చి 21న వృద్ధ దంపతులైన 91 ఏళ్ల తేవన్, 88 ఏళ్ల భార్య కుంజలి మధ్య గొడవ జరిగింది. ఇతర మహిళలతో అతడికి సంబంధం ఉందని భార్య ఆరోపించింది. దీంతో ఆగ్రహించిన తేవన్ కత్తితో భార్యను పొడిచాడు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్రంగా గాయపడింది.
కాగా, ఈ సంఘటనపై కేసు నమోదు కావడంతో అదే రోజున తేవన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యుడీషల్ కస్టడీ నిమిత్తం జైలుకు తరలించారు. దీంతో ఆ వృద్ధుడు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ పిటిషన్పై విచారణ జరిపారు. చాలా అసాధారణ రీతిలో, తార్కిక కోణంలో న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ‘ఈ పిటిషన్పై మరింతగా చర్చించదలచుకోలేదు. 91 ఏళ్ల తేవన్, వృద్ధాప్యంలో 88 ఏళ్ల భార్య కుంజలితో సంతోషంగా జీవించనివ్వండి. వారికి సంతోషకరమైన జీవితం ఉండనివ్వండి’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు భార్యాభర్తల మధ్య శాశ్వతమైన బంధాన్ని, అనుబంధాన్ని ఈ సందర్భంగా న్యాయమూర్తి గుర్తు చేశారు. ‘వృద్ధాప్యంలో తన ఏకైక బలం 88 ఏళ్ల భార్య కుంజలి అని తేవన్ తెలుసుకోవాలి. కుంజలి కూడా తన బలం 91 ఏళ్ల భర్త తేవన్ అని భావించాలి. వయస్సు వల్ల ప్రేమ మసకబారదు. అది తేజోమయంగా ప్రకాశిస్తుందని తేవన్, కుంజలి తెలుసుకోవాలి. 88 ఏళ్ల కుంజలి, ఇప్పుడు కూడా తన భర్తను ప్రేమిస్తోంది. అందుకే 91 ఏళ్ల వయస్సులో ఉన్న తన భర్తను ఆమె నిశితంగా గమనిస్తోంది. మనం పెరిగేకొద్దీ ఒకరిపైమరొకరి ప్రేమ మరింత బలపడుతుంది’ అని పేర్కొన్నారు.
కాగా, వృద్ధాప్యం, ప్రేమ, నిశ్శబ్ద సాంగత్యాన్ని ప్రతిబింబించే దివంగత మలయాళ కవి ఎన్ఎన్ కక్కాడ్ చివరి రచన ‘సఫలమీ యాత్ర’ కవితను న్యాయమూర్తి ఉటంకించారు. ‘పరిపూర్ణ జంట’ కలిసి ఉంటే గొప్ప వివాహం కాదని, అసంపూర్ణ జంట తమ విభేదాలను ఆస్వాదించడం నేర్చుకుంటేనే గొప్ప వివాహమని’ పేర్కొన్నారు. తేవన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఏప్రిల్ 10న ఈ అరుదైన తీర్పును వెల్లడించారు.