జైపూర్: రోడ్డు దాటేందుకు చిరుత ప్రయత్నించింది. బైక్‌పై వెళ్తున్న పాల వ్యక్తిని అది ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపుతప్పడంతో ఆ వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. పాలన్నీ నేలపాలయ్యాయి. గాయపడిన ఆ చిరుత లేచి మెల్లగా రోడ్డు దాటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. (Leopard Collides With Milkman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో శిల్ప్‌గ్రామ్ ప్రధాన రహదారి పక్కన ఉన్న గోడ పైనుంచి చిరుత దూకింది. రోడ్డు దాటేందుకు అది పరుగెత్తింది.
కాగా, బైక్‌పై వెళ్తున్న పాల వ్యాపారి ఆ చిరుతను ఢీకొట్టాడు. దీంతో బైక్ అదుపుతప్పడంతో అతడు రోడ్డుపై పడ్డాడు. పాల క్యాన్‌లోని పాలన్నీ నేలపై ఒలికిపోయాయి. చిరుత కూడా ఈ ప్రమాదంలో గాయపడింది. కొన్ని నిమిషాలపాటు అది కదలలేకపోయింది. ఆ తర్వాత పైకి లేచి మెల్లగా రోడ్డు దాటింది.
మరోవైపు గాయపడిన పాల వ్యాపారి పైకి లేవలేకపోయాడు. రోడ్డు మధ్యలో కూర్చొండిపోయాడు. గమనించిన కొందరు వ్యక్తులు అతడికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే చిరుతను చూసి వారు భయపడి వెనక్కి వెళ్లిపోయారు.
అయితే కారులో అటుగా వెళ్లిన వ్యక్తి ఈ ప్రమాదాన్ని గమనించాడు. కారును వెనక్కి మళ్లించి పాల వ్యాపారి వద్దకు చేరుకున్నాడు. దీంతో కారును కవర్‌గా చేసుకున్న ఒక వ్యక్తి ఆ పాల వ్యాపారిని పైకి లేపి రోడ్డు పక్కకు తీసుకువచ్చాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Udaipur में दूध वाले की बाइक से टकराया #leopard pic.twitter.com/a1EA2004P6
— Kapil Shrimali (@KapilShrimali) February 10, 2025