న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పట్టణ ప్రాంతాల్లో రాజకీయ నాయకులకు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలకు ప్రభుత్వాలు విచక్షణ కోటా కింద స్థలాలు కేటాయించడాన్ని నివారించేందుకు చట్టం తేవాల్సిన అవసరం ఉన్నదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. సదరు పట్టణ ప్రాంతంలో జన్మించిన లేదా నివసిస్తున్న భారతీయ పౌరులకు మాత్రమే స్థల కేటాయింపులు జరగాలని ఆయన సూచించారు. స్థల కేటాయింపులు పొందే వ్యక్తుల అర్హతలు, విభాగాలు చట్టంలోనే స్పష్టం చేయాలని అన్నారు. అవసరార్థులకు, పేదలకు స్థల కేటాయింపులు మాత్రం కొనసాగాలని చెప్పారు.
రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పాత్రికేయులు, కొన్నిసార్లు జడ్జీలు సభ్యులుగా ఉండే హౌజింగ్ సొసైటీలకు స్థల కేటాయింపు విషయమై మార్గదర్శక సూత్రాలను వెల్లడించాల్సిందిగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బుధవారం అటార్నీ జనరల్ ఈ సూచనలు చేశారు. సొసైటీలకు స్థలాల కేటాయింపులపై ఉమ్మడి హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మొదట ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్న అప్పీల్‌ను ఉద్దేశించి సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు 2008లో జీహెచ్ఎంసీ పరిధిలోని స్థలాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతరులతో కూడిన సొసైటీలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఆ కేటాయింపు చట్టబద్ధం కాదంటూ కొట్టివేసింది.
ఓఆర్ఓపీపై అతిశయోక్తి వద్దు!.. కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు
న్యూఢిల్లీ: మాజీ సైనికుల కోసం తీసుకొచ్చిన ఒకే ర్యాంకు-ఒకే పింఛను (ఓఆర్ఓపీ) పథకం అమలుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పథకం విషయంలో కేంద్రం అతిశయోక్తులకు పోతున్నదని, పింఛన్‌దారులకు ఇస్తున్న మొత్తానికంటే ఎక్కువ చేసి చూపిస్తున్నదని అభిప్రాయపడింది. కేసు తదుపరి విచారణను 23కు వాయిదా వేసింది. ఆర్మీలో పనిచేసి రిటైరైన ఒకే ర్యాంకు, ఒకే సర్వీసు ఉద్యోగులకు ఏకరీతి పింఛను ఇచ్చే ఉద్దేశంతో ఓఆర్ఓపీని తీసుకొచ్చారు. అయితే ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా తమకు పింఛన్ రావడంలేదంటూ కొందరు మాజీ సైనికాధికారులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.