ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న కీలక నేతలు
ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ జాఖర్ గుడ్‌బై
తాజాగా నలుగురు మాజీ మంత్రులు
రాష్ట్రంలో దయనీయ స్థితిలో కాంగ్రెస్
తలోదారి చూసుకుంటున్న నేతలు
అన్ని రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్‌ది ఇదే పరిస్థితి
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవలే మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖర్ గుడ్‌బై చెప్పారు. తాజాగా శనివారం ఆ బాటలోనే మరికొందరు సీనియర్ నేతలు కూడా పార్టీని వీడారు. ఈ జాబితాలో నలుగురు మాజీ మంత్రులు గుర్ప్రీత్ సింగ్ కంగార్, బల్బీర్ సింగ్ సిద్దూ, రాజ్ కుమార్ వర్క, సుందర్ శామ్ అరోరతో పాటు మాజీ ఎమ్మెల్యే కేవల్ సింగ్ థిల్లార్ ఉన్నారు. ఒకేసారి నలుగురు మాజీ మంత్రులు పార్టీ వీడడం సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో మరింత మంది పార్టీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారడం, మరోవైపు ఆప్ ముందుకు దూసుకెళ్లడం, బీజేపీ రూపంలో మరో ప్రత్యర్థి కాచుకుండడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. దీంతో ముందస్తుగా తమదారి చూసుకుంటున్నారు.
దయనీయ స్థితిలో పార్టీ..
పంజాబ్‌లో మొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా పతనావస్థకు చేరింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ చేతిలో ఆ పార్టీకి ఎదురైన ఘోర పరాభవంతో పరిస్థితి దిగజారింది. ఇదంతా స్వయంకృపరాదమనే విశ్లేషణలు వస్తున్నాయి. పార్టీలో అంతర్గత పోరును చక్కదిద్దడంలో అగ్రనాయకత్వం విఫలమవ్వడం ప్రస్తుత పరిస్థితికి కారణమనే అభిప్రాయాలున్నాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ పార్టీని వీడడం పెద్దదెబ్బగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ తర్వాత చన్నీని సీఎం చేయడం, పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూను నియమించడం పార్టీకి నష్టం చేకూర్చాయని చెబుతున్నారు. ఇటువంటి కష్ట సమయాల్లో పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకుడు లేకపోవడం ప్రతికూలంగా మారింది. దీనికితోడు సిద్ధూ జైలుపాలవడం కూడా పార్టీకి నష్టం చేసిందనే అభిప్రాయాలున్నాయి.
రాహుల్ నాయకత్వంపై లేని నమ్మకం!
పంజాబ్‌లోనే కాదు.. మెజార్టీ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉన్నది. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలకు రాహుల్ నాయకత్వంపై నమ్మకం లేదనే అభిప్రాయాలున్నాయి. మోదీ సర్కారుపై, ప్రజా సమస్యలపై అధిష్టానం సరైన దిశగా పోరాటం చేయడం లేదని అసంతృప్తి ఉన్నది. ఇందులో భాగంగానే ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ఇటీవలే పార్టీని వీడారు. ఎన్నికల నాటికి ఇంకొంత మంది పార్టీ వీడుతారనే ప్రచారం జరుగుతున్నది.