Lawrence Bishnoi | సల్మాన్ ఖాన్‌ను బెదిరించి ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసుల్లో వినిపిస్తున్న పేరు లారెన్స్ బిష్ణోయ్. ప్రస్తుతం ఈ గ్యాంగ్‌స్టర్ గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. అయితే, లారెన్స్ బిష్ణోయ్‌కి జైలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అతని కుటుంబం ఏటా రూ.40లక్షలు ఖర్చు చేస్తోందని బంధువు ఒకరు వెల్లడించారు. జైలులో అతనికి ప్రతి సంవత్సరం రూ.35లక్షల నుంచి రూ.40లక్షల వరకు ఖర్చవుతుందని పలు నివేదికలు పేర్కొన్నాయి. అతని బంధువు రమేశ్ బిష్ణోయ్ మాట్లాడుతూ పంజాబ్ యూనివర్సిటీ లా పట్టభద్రుడైన లారెన్స్ బిష్ణోయ్ నేరస్థుడిగా మారుతాడని అనుకోలేదని చెప్పాడు. తమ కుటుంబం సంపన్న కుటుంబమని.. లారెన్స్ తండ్రి హర్యానా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ అని చెప్పాడు. అతనికి గ్రామంలో 110 ఎకరాల భూమి ఉందన్నారు. లారెన్స్ బిష్ణోయ్ ఎప్పుడూ ఖరీదైన దుస్తులు, షూలు ధరించేందుకు ఇష్టపడేవాడన్నారు. జైలులో అతని కోసం కుటుంబం ప్రతి సంవత్సరం లక్షల్లో ఖర్చు చేస్తుందని చెప్పారు.
లారెన్స్ బిష్ణోయ్ ఫిరోజ్పూర్లో జన్మించాడు. అతని అసలు పేరు బాల్కరన్ బ్రార్. అయితే, చదువుకునే రోజుల్లో లారెన్స్‌గా పేరు మారిందని చెప్పాడు. లారెన్స్ అని పేరు పెట్టాలని అత్త సలహా ఇచ్చిందని.. దాంతో పేరు బాగుండడంతో అలాగే పిలుస్తున్నట్లు రమేశ్ బిష్ణోయ్ చెప్పుకొచ్చాడు. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగుతున్నది. అనేక హై ప్రొఫైల్ కేసుల్లో పేరు వినిపిస్తున్నది. సినీ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరింపులకు గురి చేయడంతో పాటు ఇంటి వద్ద కాల్పులకు కుట్రపన్నిన విషయం తెలిసిందే. ఇటీవల ముంబయి ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులోనూ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుకు తెరపైకి వచ్చింది. గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు ఖలిస్తాన్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటున్నారని కెనడా ప్రభుత్వం ఆరోపించింది.