High Court | మధురై: దంపతుల్లో భార్యకు, అదే విధంగా, భర్తకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని, అది వారి ప్రాథమిక హక్కు అని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. ఓ భర్త సమర్పించిన భార్య కాల్ రికార్డ్స్ డాక్యుమెంట్స్‌ను సాక్ష్యంగా పరిగణించేందుకు తిరస్కరించింది. ఆ కాల్ రికార్డ్స్‌ను ఆ భర్త రహస్యంగా సంపాదించారు. వ్యభిచారం, క్రూరత్వాలకు పాల్పడుతున్న తన భార్య నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని ఆ భర్త కోరుతున్నారు. వ్యక్తిగత గోప్యత హక్కు పరిధిలోకి వివాహ సంబంధమైన గోప్యత వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ హక్కును ఉల్లంఘిస్తూ సంపాదించే ఏ పత్రమైనా న్యాయస్థానాల్లో సాక్ష్యంగా అనుమతించదగినది కాదని వివరించింది. భార్య వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని ఆమెకు తెలియకుండా, ఆమె సమ్మతి లేకుండా పొందడాన్ని నిరపాయకరమైనదిగా పరిగణించలేమని చెప్పింది. భార్యపై భర్త కానీ, భర్తపై భార్య కానీ నిఘా పెట్టకూడదని తెలిపింది. ఈ కేసులో తన భర్త సమర్పించిన కాల్ రికార్డ్స్‌ను సాక్ష్యంగా అనుమతించరాదని భార్య తమిళనాడులోని పరమకుడి సబ్ కోర్టును కోరారు. కానీ సబ్ కోర్టు ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆమె హైకోర్టులో అపీలు చేశారు.
ఈ కాల్ రికార్డ్స్‌ను దొంగతనంగా సంపాదించినందువల్ల ఆయన తన భార్య వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించారని, ఈ పత్రాలు సాక్ష్యంగా అనుమతించదగినవి కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. మహిళలకు స్వయంప్రతిపత్తి ఉంటుందని తెలిపింది. తమ వ్యక్తిగత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదని కోరుకునే హక్కు వారికి ఉంటుందని వివరించింది.