Late Comers : కేంద్ర పభుత్వం ఉద్యోగులకు చేదువార్త చెప్పింది. ఇకపై ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే ఉపేక్షించేది లేదని ఆదేశాలు జారీచేయనుంది. ఈ మేరకు త్వరలో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రచురించింది. కొత్త నిబంధనను త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చే కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది.
కొత్త రూల్ ప్రకారం.. ఉద్యోగుల ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధుల్లో ఉండాలి. ఉదయం 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ సదుపాయం ఉంటుంది. ఉద్యోగి ఆ గ్రేస్ పీరియడ్ కూడా ముగిసిన తర్వాత కార్యాలయానికి వస్తే హాఫ్ డే సెలవుగా పరిగణించబడుతుంది. అయితే నెలలో రెండు రోజులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తారు. రెండు రోజులకు మించి గ్రేస్ పీరియడ్ తర్వాత ఆఫీస్కు వస్తే.. అదనంగా ఆలస్యం చేసే ఒక్కోరోజు హాఫ్ డే వేతనం చొప్పున కోత విధించనున్నారు.
అయితే ఉద్యోగికి కాజువల్ లీవులు (CLs) ఉంటే వాటి నుంచి హాఫ్ డే లీవును మినహాయించనున్నారు. కాజువల్ లీవులు లేకపోతే ఎర్న్డ్ లీవుల (ELs) నుంచి తగ్గించనున్నారు. అవి కూడా లేకపోతే వేతనంలో కోత విధించనున్నారు. ఆలస్యంగా వచ్చే వాళ్లకు మాత్రమే కాకుండా ఎర్లీగా ఆఫీస్ నుంచి వెళ్లిపోయే వాళ్లకు కూడా ఈ నియమం వర్తిస్తుందని తెలిపారు. కాగా వేతనంలో కోత వార్తలపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము ఒక్కోరోజు రాత్రి 7 గంటల వరకు పనిచేస్తున్నామని, అప్పుడు తమకు అదనపు వేతనం ఇస్తలేరుగా అని ప్రశ్నిస్తున్నారు.