రాంబన్: జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ (Ramban) జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని దుక్సర్ దాల్వా (Duksar Dalwa) గ్రామంలో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో 13 ఇండ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో భూమి కుంగిపోయింది. దీంతో బాధిత కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాంబన్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుక్సర్ దాల్వాలో ఒక చదరపు కిలోమీటర్ మేర కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నిలిపివేశామన్నారు.
ఈ ప్రాంతంలో గత మూడు రోజులుగా కొండచరియలు విరిగిపడుతున్నాయని జిల్లా అధికారి గుల్ తన్వీర్ వాణీ వెల్లడించారు. శుక్రవారం నుంచి ఇది ప్రారంభమైందని తెలిపారు. రోడ్లు కుంగిపోవడంతో ప్రధార రహదారులపై వాహనాల రాకపోకలను నిలిపివేశామన్నారు. దీంతో కొత్త రోడ్లను నిర్మించాలని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) అధికారులను కోరినట్లు చెప్పారు. బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని, త్వరలోనే కొత్త ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు.