Chandrayaan-3 | బెంగళూరు: చంద్రయాన్-3ల్యాండర్ మాడ్యూల్ జాబిల్లికి మరింత చేరువైంది. శుక్రవారం చేపట్టిన డీబూస్టింగ్ (వేగాన్ని తగ్గించే) ప్రక్రియ విజయవంతమైనట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ సాంకేతికంగా చురుగ్గా ఉన్నట్టు తెలిపింది. ‘డీబూస్ట్ ప్రక్రియ అనంతరం ల్యాండర్ మాడ్యూల్ 113X157 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించింది.
ఈ నెల 20న తెల్లవారుజామున 2 గంటలకు రెండో డీబూస్టింగ్ ప్రక్రియ చేపడతాం’ అని ఇస్రో వెల్లడించింది. రెండో విన్యాసం తర్వాత ల్యాండర్ జాబిల్లికి మరింత చేరువ కానున్నది. అన్నీ సవ్యంగా సాగితే ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ కాలుమోపనుంది.
చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న ల్యాండర్ విక్రమ్ తొలిసారి జాబిల్లి ఫొటోలను తీసింది. చంద్రుడి ఉపరితలంపై ఉండే బిలాలు ఈ ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిలాల పేర్లను కూడా ఇస్రో వెల్లడించింది. ఫ్యాబ్రీ, గియోర్డానో బ్రూనో, హర్కెబీ జే బిలాల ఫొటోలను ల్యాండర్ తీసినట్టు తెలిపింది. ఈ ఫొటోలను ఇస్రో ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నది.