ముంబై: కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని బీజేపీ అధికారంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ నేతకు అప్పనంగా కట్టబెట్టడంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే అధ్యక్షుడిగా ఉన్న శ్రీ మహాలక్ష్మి జగదాంబ సంస్థాన్‌కు నాగపూర్‌లోని కొరాడి ప్రాంతంలో రూ.4.8 కోట్ల విలువైన 5 హెక్టార్ల భూమిని ఉచితంగా కేటాయించారు.
సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి అజెండా, చర్చ జరపకుండా ఏకగ్రీవంగా దీనిని ఆమోదించారు. ఈ భూమి ధారాదత్తంపై ఆర్థిక, రెవెన్యూ శాఖలు అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా భూమిని పొందేందుకు ఉండాల్సిన అర్హత, అనుభవం ఆ ట్రస్టుకు లేకపోయినా భూమిని కేటాయించారు. ప్రభుత్వ చర్యపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.