న్యూఢిల్లీ, నవంబర్ 10: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి తన తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. 74 ఏండ్ల లాలూ కొన్నేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ చికిత్స కోసం గత నెలలో ఆయన సింగపూర్‌కు వెళ్లొచ్చారు. ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉన్నది. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య తన తండ్రికి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని లాలూ కుటుంబసభ్యులు గురువారం మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ ఎక్కడ నిర్వహిస్తారన్నది తెలియరాలేదు.
గర్వంగా ఫీలవుతున్నా: రోహిణి
కిడ్నీ దానంపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య స్పందించారు. తన తండ్రికి కిడ్నీ ఇవ్వటం గర్వంగా ఉన్నదని తెలిపారు. లాలూ, రబ్రీదేవి దంపతులకు మొత్తం 9 మంది సంతానం. ఇద్దరు కుమారులు కాగా, ఏడుగురు కూతుళ్లు. వారిలో తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ కొడుకులు. రోహిణి రెండో కూతురు. ఆమె కంటే ముందు మీసా భారతి జన్మించారు.