సూరత్, జనవరి 2: దేశంలో టెక్స్టైల్ క్యాపిటల్‌గా పేరుగాంచిన గుజరాత్‌లోని సూరత్.. ఎన్నడూ లేని తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. పరిశ్రమలు మూతబడుతున్నాయి. ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది. కార్మికులకు పని దొరకడం లేదు. ఖర్చులు పెరిగిపోయి వారి జీవితం దుర్భరంగా మారిపోయింది. సూరత్ టెక్స్టైల్ ఇండస్ట్రీ డాటా ప్రకారం.. గతంలో ఇక్కడ 485 ప్రాసెసింగ్ యూనిట్లు(డయింగ్, ప్రింటింగ్) ఉండేవి. వీటిల్లో దాదాపుగా నాలుగైదు లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందేవారు. అయితే, వీటిలో గత మూడు నాలుగు నెలల్లోనే 15 నుంచి 20 యూనిట్లు మూతబడ్డాయి.
కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇంతకుముందు సూరత్‌లో రోజుకు దాదాపు 4.5 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అయ్యేదని, ఇప్పుడు 2.5 కోట్ల మీటర్లకు ఉత్పత్తి పడిపోయిందని సౌత్ గుజరాత్ టెక్స్టైల్ ప్రాసెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేంద్ర విఖారియా తెలిపారు. సింథటిక్ వస్ర్తాలకు డిమాండ్ తగ్గడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, అక్రమ యూనిట్లు పెరగడం వంటి కారణాలతోనే పరిశ్రమలు మూతబడుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా వస్త్ర తయారీ చేసేందుకు ప్రోత్సాహకంగా ఉండే టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ ఫండ్ కూడా గతేడాది ఆగిపోయిందని వాపోతున్నారు.
కార్మికులకు గడ్డుకాలం
సూరత్ వస్త్ర పరిశ్రమ దెబ్బతినడం కార్మికులకు శాపంగా మారింది. ఇటీవలి కాలంలో దాదాపు 70 వేల నుంచి లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని కార్మిక నేత కమ్రాన్ ఉస్మానీ తెలిపారు.