న్యూఢిల్లీ, జూన్ 9: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) – అడ్వాన్స్డ్ ఫలితాల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వేద్ లాహోటి 360 మార్కులకు గానూ 355 మార్కులు సాధించి ఫలితాల్లో టాప్ ర్యాంకు సాధించాడు. జేఈఈ చరిత్రలోనే అత్యధిక మార్కులు ఇవి. ఆదిత్య(ఐఐటీ ఢిల్లీ జోన్) రెండో ర్యాంకు, భోగల్‌పల్లి సందేశ్(ఐఐటీ మద్రాస్ జోన్) మూడో ర్యాంకు సాధించారు. అమ్మాయిల్లో ఐఐ టీ బాంబే పరిధికి చెందిన ద్విజ ధర్మేశ్‌కుమార్ పటేల్ 332 మార్కులు సా ధించి టాపర్‌గా నిలిచింది. ఆమెకు ఆల్ ఇండియాలో ఏడో ర్యాంకు లభించింది.
మద్రాస్ జోన్ నుంచే ఎక్కువ మంది
టాప్ 10 ర్యాంకుల్లో నాలుగు ఐఐటీ మద్రాస్ పరిధికి చెందిన వారే దక్కించుకున్నారు. ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే జోన్ల పరిధికి చెందిన అభ్యర్థులు అర్హత పొందారు. మొదటి 500 ర్యాంకులు సాధించిన వారిలోనూ ఐఐటీ మద్రాస్ జోన్‌కు చెందిన వారు 145 మంది ఉండగా, ఐఐటీ బాంబే జోన్ నుంచి 136, ఐఐటీ ఢిల్లీ జోన్ నుంచి 122 మంది ఉన్నారు. ఏడుగురు విదేశీ విద్యార్థులు, 179 మంది ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) విద్యార్థులు కూడా పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కాగా, సీట్ల భర్తీకి సోమవారం నుంచి కౌన్సిలింగ్ జరగనుంది.