న్యూఢిల్లీ: బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో జరిగిన కాల్పుల్లో యువకుడి హత్యకు సహకరించిన లేడీ డాన్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది. (Lady Don Arrested) నాలుగు నెలలుగా పోలీసుల కళ్లగప్పి తిరుగుతున్న ఆ యువతి నేపాల్ మీదుగా అమెరికా పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ సమాచారం తెలిసిన పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. జూన్ 18న రాత్రి 9.30 గంటలకు ఢిల్లీలోని బర్గర్ కింగ్ అవుట్లెట్లోకి 26 ఏళ్ల అమన్ జూన్ ప్రవేశించాడు. అతడ్ని హనీట్రాప్ చేసిన 19 ఏళ్ల యువతి వేచి ఉన్న టేబుల్ వద్దకు వెళ్లి కూర్చొన్నాడు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చి అమన్‌పై కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ మహిళ అమన్ ఫోన్, వాలెట్ తీసుకుని పారిపోయింది.
కాగా, 2020లో హర్యానాలో జరిగిన శక్తి దాదా హత్యకు ప్రతీకారంగా అమన్‌ను హత్య చేసినట్లు ప్రస్తుతం పోర్చుగల్‌లో ఉన్నట్లు అనుమానిస్తున్న గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. అయితే 19 ఏళ్ల అనూ ధంఖర్, హిమాన్షు గ్యాంగ్‌లో లేడీ డాన్‌గా పేరుపొందింది. అమెరికాలో విలాసవంతమైన జీవితానికి హిమాన్షు ఆమెకు హమీ ఇవ్వడంతో అమన్‌ను హానీట్రాప్ చేసి అతడి హత్యకు సహకరించింది.
మరోవైపు అమన్‌పై కాల్పుల తర్వాత బర్గర్ కింగ్ అవుట్లెట్ నుంచి పారిపోయిన అనూ, ఢిల్లీలోని అద్దె ఇంటిని ఖాళీ చేసింది. బస్సులో చండీగఢ్ వెళ్లింది. అమృత్సర్ మీదుగా కత్రా చేరుకుంది. అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేసింది. ఆ తర్వాత హిమాన్షు ఆదేశాల మేరకు రైలులో జలంధర్ వెళ్లింది. చండీగఢ్ మీదుగా హరిద్వార్‌కు చేరుకుంది. మూడు నాలుగు రోజులు అక్కడ ఉన్నది. ఆ తర్వాత రాజస్థాన్‌లోని కోటాకు స్థావరాన్ని మార్చింది. నాలుగు నెలలుగా అక్కడ బస చేసింది. ఈ కాలంలో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు ఆమెకు డబ్బులు సమకూర్చాడు.
కాగా, అమన్ హత్య కేసు వేడి తగ్గిందని, దీంతో దేశాన్ని వీడాలని అక్టోబరు 22న అనూకు హిమాన్షు కాల్ చేశాడు. నేపాల్, దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తానని ఆమెకు చెప్పాడు. దీంతో కోటాలోని వసతిగృహాన్ని అనూ ఖాళీ చేసి లక్నో చేరుకుంది. శుక్రవారం లఖింపూర్ ఖేరీ నుంచి నేపాల్ పారిపోయేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ సమాచారం తెలుసుకున్న ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనూకు నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. జనవరిలో మాతూరామ్ హల్వాయి వద్ద జరిగిన కాల్పుల్లో ఆమె పాత్ర కూడా ఉందని వెల్లడించారు.