90 hour work week | ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని (90 hour workweek), ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్అండ్టీ చైర్మన్ (L&T Chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ‘ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ ఏం చేస్తారు..? ఎంతసేపని భార్య ముఖం తదేకంగా చూడగలరు? ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలువురు సెలబ్రిటీలు సైతం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై కంపెనీ స్పష్టతనిచ్చింది.
దేశ నిర్మాణమే తమ సంస్థ ప్రధాన లక్ష్యం అని పేర్కొంది. గత ఎనిమిది దశాబ్దాలకు పైగా భారతదేశ మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను ఎల్ అండ్ టీ మెరుగుపరిచిందని వివరించింది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే క్రమంలో అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసాధారణమైన కృషి అవసరమని పేర్కొంది. ఈ విస్త్రృత లక్ష్యాన్నే చైర్మన్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని వివరణ ఇచ్చింది.
వారానికి 90 గంటలు పని చేయాలన్న ఎల్అండ్టీ చైర్మన్
ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎల్అండ్టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్లైన్లో సుబ్రహ్మణ్యన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. ‘ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను. మీతో ఆదివారాలు సైతం పని చేయిస్తే చాలా సంతోషపడతాను. ఎందుకంటే, నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నాను. ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీసుకు వెళ్లి పని చేయడం ప్రారంభించు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగని సుబ్రహ్మణ్యన్.. వారానికి 90 గంటలు పని చేయాలని సైతం ఆయన సెలవిచ్చారు. తాను ఒక చైనా వ్యక్తితో మాట్లాడానని, చైనా కార్మికులు వారానికి 90 గంటలు పని చేస్తారని, అమెరికన్లు 50 గంటలే పని చేస్తారు కాబట్టి కొన్ని రోజుల్లో అమెరికాను చైనా దాటేస్తుందని ఆ వ్యక్తి చెప్పినట్టు సుబ్రహ్మణ్యన్ చెప్పుకొచ్చారు. ‘మీరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాల్సిందే. ముందుకొచ్చి పని చేయండి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలను చిన్నచూపు చూసేలా ఆయన మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు.
Also Read..