న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పంజాబ్ ప్రభుత్వ పాలనలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర మంత్రి, ఆప్ నాయకుడు కుల్దీప్ సింగ్ ధలీవాల్ ఉనికిలో లేని ఒక శాఖను 20 నెలలుగా ‘నిర్వహించారు!’ ఈ విషయాన్ని తీరిగ్గా గుర్తించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎట్టకేలకు గెజిట్ నోటీఫికేషన్ ద్వారా అవసరమైన సవరణలు చేపట్టారు. రాష్ట్రంలో ఉనికిలో లేని పరిపాలనా సంస్కరణల శాఖను మంత్రి కుల్దీప్ సింగ్ ధలీవాల్కు పంజాబ్ ప్రభుత్వం గతంలో కేటాయించింది.
ఇప్పుడు ఆ శాఖ నుంచి తప్పించి కేవలం ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను మాత్రమే ఉంచారు. మొదట్లో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిగా ధలీవాల్ ఉన్నారు. 2023 మేలో క్యాబినెట్లో మార్పులు చేర్పులు చేయగా ఆ శాఖ నుంచి ఆయనను తప్పించారు. ఆ తర్వాత ఆయనకు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ, పరిపాలనా సంస్కరణల శాఖను కూడా అప్పగించారు. 2024 సెప్టెంబర్లో మరోసారి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగగా ఆ రెండు శాఖలను ధలీవాల్ కొనసాగించడం విశేషం. అయితే, పరిపాలనా సంస్కరణల శాఖ అన్నదే ఉనికిలో లేదని ఇప్పుడు బయటపడింది. ఈ వ్యవహారంపై ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎండగట్టింది.