Kuki Woman : మణిపూర్‌లో మూడేళ్లక్రితం చెలరేగిన హింస గురించి తెలిసిందే. ఈ హింసలో సామూహిక అత్యాచారానికి గురైన ఒక యువతి చికిత్స పొందుతూ గత ఆదివారం (జవనరి 11) మరణించింది. అప్పట్లో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల సందర్భంగా వందల మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు, దహనాలు జరిగాయి.
ఇదే సమయంలో కుకీ తెగకు చెందిన ఒక యువతిని, ఏటీఎం వద్ద ఉండగా దుండగులు మే 15, 2023న ఎత్తుకెళ్లారు. అప్పుడు ఆమె వయసు 18. ఇంఫాల్ లో ఒక బ్యూటీ సెలూన్లో పని చేస్తుండేది. ఆ యువతిని బిష్ణాపూర్ జిల్లాలోని ఒక పర్వత ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. మెయితీ తెగకు చెందిన మహిళలు కూడా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కానీ, ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకుంది. అనంతరం ఆమెకు ప్రభుత్వం వైద్యం అందించింది. మూడేళ్లుగా నాగాలాండ్, అసోం, మణిపూర్‌లోని వివిధ ఆస్పత్రులకు చికిత్స కోసం తీసుకెళ్లారు. అయినప్పటికీ, అప్పటి గాయాల ప్రభావంతో నిరంతరం ఇంట్లో అనారోగ్యానికి గురవుతుండేది. ఇటీవల ఇంట్లో కూడా స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు చురాచంద్ పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
ఆమె అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లి తెలిపింది. ఆమె ఒంటికి అయిన గాయాలతోపాటు, మానసికంగా చాలా కుంగిపోయిందని తల్లి ఆవేదనతో తెలిపింది. ఇక.. అప్పటి అత్యాచార ఘటనకు సంబంధించి యువతిని నలుగురు కారులో ఎత్తుకెళ్లారు. ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో వాహనంలో వేరే చోటుకు వెళ్తుండగా.. వారి మధ్య జరిగిన ఘర్షణల సందర్భంగా ఆమె వాహనంలోంచి పడిపోయింది. దీంతో చాకచక్యంగా అక్కడినుంచి యువతి తప్పించుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని బాధిత యువతి తల్లి ఆరోపించింది.