న్యూఢిల్లీ : కొవిడ్-19 నుంచి వ్యాక్సిన్లే మనకు భారీ రక్షణ కవచంలా నిలుస్తాయని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అన్నారు. కరోనా ప్రొటోకాల్‌ను అనుసరించి అర్హులైన వారంతా సత్వరమే వ్యాక్సినేషన్‌కు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహమ్మారి అనుభవం నుంచి మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడవుతోందని అన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో మరణించిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ మార్కెటింగ్‌లో తీసుకువచ్చిన పలు సంస్కరణలతో రైతులకు మరింత సాధికారత చేకూరిందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు రైతులకు మెరుగైన దర లభిస్తుందని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల సమున్నత పోరాటాలతోనే భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. వారి త్యాగాలను మనం సదా స్మరించాలని అన్నారు. నైపుణ్యాలను కలిగిన చిన్నారులను, కుమార్తెలను గుర్తించి వారు ఉన్నతస్ధానాలకు చేరుకునేలా ప్రోత్సహించాలని తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు.
మన ప్రజాస్వామ్యం పార్లమెంటరీ వ్యవస్ధ పునాదులపై నిర్మించబడిందని, పార్లమెంట్‌ను మనం ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తెరగాలని అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి రానుండటం మన ప్రజాస్వామ్యంలో అభివృద్ధి ప్రస్ధానానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మన ప్రజాస్వామ్య దేవాలయం కొత్త భవనంలో కొలువుతీరడం దేశ ప్రజలకు గర్వకారణమని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.