Kolkata Doctor Murder | కోల్‌కతా, ఆగస్టు 26: పాలీగ్రాఫ్ టెస్టులో కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ అబద్ధాలు, పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. తాను ఘటన జరిగిన సెమినార్ హాల్‌కు వెళ్లే సమయానికే బాధిత వైద్యురాలు చనిపోయిందని, తర్వాత నేను భయంతో అక్కడి నుంచి పారిపోయానని లై డిటెక్టర్ టెస్టులో నిందితుడు చెప్పుకొచ్చాడని తెలిసింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన జరిగిన రోజు రాత్రి ముందు నిందితుడు సంజయ్ రాయ్ మరో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మైనర్ కుమార్తెకు లైంగిక దాడి బెదిరింపులు వచ్చాయి. దీన్ని బెంగాల్ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.