కోల్కతా, సెప్టెంబర్ 2: మహిళలపై రేప్, హత్యలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించేందుకు ఉద్దేశించిన ‘అపరాజిత మహిళా & శిశు బిల్లు’ను పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు సోమవారం తెలిపాయి. కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. మంగళవారం సభలో ప్రవేశపెట్టనుంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశంలో కులగణనకు ఆర్ఎస్ఎస్ మద్దతు ప్రకటించింది. ఈ అంశంపై ఆర్ఎస్ఎస్ ముఖ్య అధికార ప్రతినిధి సునీల్ అంబేకర్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హిందూ సమాజంలో కులం, కుల సంబంధాలు అనే సున్నితమైన అంశం ఉంది. జాతీయ ఐక్యత, సమగ్రతకు సైతం ఇది ముఖ్యమైన అంశం. నిర్దిష్ట సమాజం లేదా కులానికి అందించే అన్ని సంక్షేమ పథకాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలనేది ఆర్ఎస్ఎస్ అభిప్రాయం. ఇందుకోసం ప్రభుత్వానికి గణాంకాలు కావాలి. అయితే ఎన్నికల ప్రయోజనాలకు, రాజకీయ లబ్ధికి ఈ గణాంకాలను దుర్వినియోగం చేయరాదు’ అని సునీల్ అంబేకర్ వ్యాఖ్యానించారు.