Bomb threat : కోల్కతాలోని ‘ది నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (Kolkata airport)’ లో హైఅలర్ట్ (High Alert) ప్రకటించారు. కోల్కతా నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానం (Indigo flight) లో పెట్టినట్టు ఆ విమానం టేకాఫ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తి విమానాశ్రయ అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో అధికారులు వెంటనే అప్రమత్తమై హైఅలర్ట్ ప్రకటించారు. ఇండిగో విమానంలోని ప్రయాణికులు, లగేజీని కిందికు దింపేశారు.
విమానాన్ని ‘ఐసోలేషన్ బే’ లోకి తీసుకెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఆ విమానంలో అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా కోల్కతా విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.20 గంటలకు ముంబైకి చేరుకోవాల్సి ఉంది. మొత్తం 195 మంది చెక్ఇన్ అయిన తర్వాత బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టారు.
ఎమర్జెన్సీ ప్రకటన చేసి ఎయిర్పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. బాంబు నిర్వీర్య బృందాలు, ఇతర రక్షణ బృందాలు ఎయిర్పోర్టులో అణువణువూ గాలించాయి. విమానాశ్రయం వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత ఇలా బాంబు బెదిరింపులు రావడం ఇది రెండోసారి. మే 6న కూడా చండీగఢ్ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు అమర్చినట్లు ఓ దుండగుడు ఫోన్ చేశాడు.