Arunachal Pradesh | ఇటానగర్, సెప్టెంబర్ 9: భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొరబడినట్టు తెలుస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో ఉన్న కపాపు అనే ప్రాంతంలోకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చొరబడినట్టు ఆనవాళ్లు ఉన్నాయని ఇటానగర్ కేంద్రంగా పని చేసే ఓ వార్తాసంస్థ పేర్కొన్నది. ఈ ప్రాంతం ఇండో-చైనా సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల లోపల ఉన్నది. ఇక్కడ చలిమంటలు వేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయి. బండరాళ్లపై స్ప్రే పెయింట్‌లో చైనా, 2024 అని రాసి ఉంది. చైనాకు సంబంధించిన పలు ముద్రలను కూడా పెయింటింగ్ వేశారు. చైనా ఆహార పదార్థాలు సైతం లభించాయి. దాదాపు వారం రోజుల క్రితం చైనా బలగాలు ఇక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఉండవచ్చని, ఇందుకు గుర్తుగానే చైనా సైనికులు కావాలనే పెయింటింగ్‌లు వేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చొరబాటు కాదు: కిరణ్ రిజిజు
అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా చొరబడిందనే వార్తలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. సరిహద్దు సరిగ్గా లేని ప్రాంతాల్లో పహారా కాస్తున్నప్పుడు ఒక దేశ భూభాగంలోకి మరో దేశ బలగాలు వెళ్తుంటాయని, అంతమాత్రాన భారత భూభాగాన్ని ఆక్రమించినట్టు కాదన్నారు. సరిహద్దు స్పష్ట ంగా లేని ప్రాంతాల్లో కేవలం కొన్ని పెయింటింగ్‌లు ఉన్నంత మాత్రాన ఆ ప్రాంతాన్ని ఆక్రమించినట్టు కాదని, చైనా మన భూభాగాన్ని తీసుకోలేదని, ఎలాంటి శాశ్వత నిర్మాణాన్ని అనుమతించబోమని పేర్కొన్నారు.