లక్నో: ఒకరి బర్త్ డే పార్టీ కోసం మహిళా డ్యాన్సర్లను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గన్స్‌తో బెదిరించి వారిని బలవంతంగా తీసుకెళ్లారు. (Dancers Kidnaped For Party) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బర్త్ డే పార్టీ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. వారి చెర నుంచి డ్యాన్సర్లను కాపాడారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. కాళ్లకు బ్యాండేజీతో వీల్స్చైర్స్లో ఉన్న వారు ఇకపై ఎలాంటి తప్పు చేయబోమని పోలీసులను వేడుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అర్ధరాత్రి వేళ అజిత్ సింగ్ పుట్టిన రోజును కొందరు వ్యక్తులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బర్త్ డే పార్టీలో డ్యాన్సర్స్‌తో డ్యాన్స్ చేయించాలని భావించారు.
కాగా, మద్యం సేవించిన ఆ వ్యక్తులు రెండు వాహనాల్లో ఒక ప్రాంతానికి చేరుకున్నారు. మ్యూజిక్ షోలో డ్యాన్సర్లుగా పనిచేసే ఇద్దరు మహిళలు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లారు. తమతో రావాలని ఆ డ్యాన్సర్లను డిమాండ్ చేశారు. అర్ధరాత్రి కావడంతో వారితో వెళ్లేందుకు ఆ మహిళలు నిరాకరించారు. దీంతో ఆ వ్యక్తులు గన్స్‌తో బెదిరించి ఆ డ్యాన్సర్లను బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అజిత్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడున్న డ్యాన్సర్స్‌ను రక్షించారు. ఆరుగురు నిందితులైన అర్థక్ సింగ్, నాగేంద్ర యాదవ్, అశ్వన్ సింగ్, అజిత్ సింగ్, వివేక్ సేథ్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు నిసార్ అన్సారీ, ఆదిత్య సాహ్ని కోసం పోలీసులు వెతికారు. వారిని అరెస్ట్ కోసం రూ. 25,000 నగదు రివార్డు కూడా ప్రకటించారు.
కాగా, ఒక కాలువ సమీపంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా పరారీలో ఉన్న నిందితులు నిసార్, ఆదిత్య కనిపించారు. పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా నిందితులు కాల్పులు జరిపారు. దీంతో వారి కాళ్లపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి హాస్పిటల్లో చికిత్స అందించారు. కాళ్లకు ప్లాస్టర్‌తో వీల్‌చైర్‌లో కూర్చొన్న ఆ నిందితులను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా చెవులు పట్టుకున్న వారిద్దరూ తమను క్షమించాలని, ఇకపై ఎలాంటి తప్పుడు పనులు చేయబోమంటూ పోలీసులను వేడుకున్నారు.
మరోవైపు డ్యాన్సర్ల కిడ్నాప్ సంఘటనకు సంబంధించి 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సంతోష్ మిశ్రా తెలిపారు. నేరానికి వినియోగించిన రెండు ఎస్‌యూవీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే ఒక గన్, నాలుగు పిస్టల్స్, పెద్ద సంఖ్యలో బుల్లెట్లు, డబ్బు కూడా నిందితుల వద్ద లభించినట్లు ఆ అధికారి వెల్లడించారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.