భువనేశ్వర్: బీజేపీ పాలిత ఒడిశాలో బాలికలు, మహిళలకు రక్షణ కరువవుతున్నది. వరుస లైంగికదాడి ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. తాజాగా, జజ్పూర్ జిల్లాలో హాకీ క్రీడలో శిక్షణ పొందుతున్న బాలికపై ఆమె కోచ్, అతని ఇద్దరు సహచరులు లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు రోడ్డుపై నడుస్తుండగా, ఆమెకు హాకీ క్రీడలో శిక్షణనిస్తున్న కోచ్ సార్థక్, అతని సహచరులు సందీప్, సాగర్ ఆమెను కిడ్నాప్ చేశారు.
ఈ నెల 3న ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి సామూహికంగా లైంగిక దాడి చేశారు. ఈ విషయాన్ని బయటపెడితే, చంపేస్తామని ఆమెను బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని జిల్లా కోర్టులో జడ్జి సమక్షంలో నమోదు చేశారు. నిందితులపై బీఎన్ఎస్, పోక్సో చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన క్రీడా వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. క్రీడా శిక్షణ కేంద్రాల్లో బాలికల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ఒడిశా శాఖ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, భువనేశ్వర్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని (19)పై మార్చి18న అత్యాచారం జరిగినట్లు నమోదైన కేసులో ఈ చర్య తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఆమె స్నేహితురాలు క్యాంటీన్ స్కేర్‌లో ఉదిత్ ప్రధాన్‌ను ఆమెకు పరిచయం చేసింది. వారంతా కలిసి అక్కడి నుంచి ఉదిత్ కారులో నయాపల్లిలోని ఓ హోటల్‌కు వెళ్లారు. బాధితురాలు మినహా మిగిలిన వారంతా మద్యం సేవించారు. బాధితురాలికి ఉదిత్ మత్తు పదార్థాలు కలిపిన సాఫ్ట్ డ్రింక్ ఇచ్చాడు. కాసేపటికి బాధితురాలు స్పృహ కోల్పోయింది. మెలకువ వచ్చి చూసేసరికి, తనపై ఉదిత్ లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించింది.